Site icon HashtagU Telugu

AP High Court : మూడు రోజుల పాటు ఏపీ హైకోర్టు కు దసరా సెలవులు

Ap High Court

దసరా (Dasara ) సందర్బంగా ఏపీ హైకోర్టు (AP High Court) కు మూడు రోజుల పాటు సెలవు దినాలు (Holidays) ప్రకటించారు. అక్టోబర్ 25 నుండి 27 వరకు సెలవులు ఇస్తూ హైకోర్టు రిజ్రిస్ట్రార్ జనరల్‌ వై.లక్ష్మణరావు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 30న హైకోర్టు కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవుతాయని నోటిఫికేషన్‌ లో పేర్కొన్నారు . ఈ సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి వెకేషన్‌ బెంచ్‌లను ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్‌ ఏవీ రవీంద్ర బాబు, జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయి వెకేషన్‌ కోర్టు జడ్జిలుగా వ్యవహరించనున్నారు. ఈ సెలవుల సమయంలో జస్టిస్‌ వెంకటేశ్వర్లు, జస్టిస్‌ రవీంద్రబాబు ధర్మాసనంలో కేసులను విచారిస్తారు. జస్టిస్‌ జ్యోతిర్మయి సింగిల్‌ జడ్జిగా కేసులను విచారిస్తారు. హెబియస్‌ కార్పస్, బెయిల్స్, ముందస్తు బెయిల్స్, ఇతర అత్యవసర వ్యాజ్యాలపై మాత్రమే వెకేషన్‌ జడ్జిలు విచారణ జరపాల్సి ఉంటుంది. ఈ సెలవుల్లో అత్యవసర కేసులు దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 25న దాఖలు చేయాల్సి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె..ఈరోజు ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కొత్తగా నలుగురు ప్రమాణస్వీకారం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నూతన న్యాయమూర్తులుగా హరినాథ్‌ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్‌ లతో ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ (CM Jagan), గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోద ముద్ర వేశారు. దీంతో కేంద్ర న్యాయ శాఖ వీరి నియామకానికి ఈ నెల 18న ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు ప్రస్తుతం 27 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్ నరేందర్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కొత్తగా నియమితులైన వారితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కు చేరింది.

Read Also : Mangalavaram: ఆసక్తి రేపుతున్న మంగళవారం ట్రైలర్, వరుస హత్యలపై థ్రిల్లింగ్స్