Site icon HashtagU Telugu

Darsi YSRCP : దర్శి వైసీపీలో మద్దిశెట్టికి “దరువులు”

darsi YCP MLA

darsi YCP MLA

దర్శి ఈ నియోజకవర్గం రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రముఖ వ్యాపారవేత్త మద్దిశెట్టి వేణుగోపాల్ ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ ఏం చేస్తాం.. ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందం కంటే.. సొంత పార్టీలో కుమ్ములాటతో నిత్యం విసిగిపోతున్నారు. ప్రత్యర్థి పార్టీ పెట్టే టార్చర్ కంటే వైసీపీ నేతలు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నారటా. అందుకేనేమో ఏకంగా పార్టీపైన, పార్టీలో ప్రధానమైన నేతలపై మ‌ద్దిశెట్టి విమర్శలు బాణాలు ఎక్కుపెడుతున్నారు.

బూచేపల్లితో మద్దిశెట్టికి వైరం

దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి, ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం కాదు.. మాడి మసైపోతుంది. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెత్తనం చేస్తున్నారంటూ ఏకంగా ఆయనపై విమర్శనాస్త్రాలు చేశారు. వంద తప్పులు చేశారని… 101వ తప్పు చేస్తే సైలెంట్‌గా ఉండటం తన వల్ల కాదంటూ సంచలన కామెంట్స్ చేశారు. మూడున్నరేళ్లలో ప్రత్యర్థుల వైఖరితో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నానని వాపోయారు. ప్రత్యర్ధుల వంద తప్పులు పూర్తయ్యాయని ఇక వారిని క్షమించేది లేదని బహిరంగ సభల్లో చెబుతున్నారు మద్దిశెట్టి. అంతే కాదు కార్యకర్తలను పార్టీ పట్టించుకోవాలని.. కాంట్రాక్టులు చేసి ఎంతో మంది నాశనం అయ్యారన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందంటూ చురకలు అంటించారు.

జగన్‌కు నమ్మకం ఉంటేనే పార్టీలో ఉంటాను

తాజాగా దర్శి మీద బూచేపల్లి ఫ్యామిలీ కన్నేయడంతో స్థానికంగా పోటీ వాతావరణం నెలకొంది. సీఎంని పిలిచి భారీ బహిరంగ సభ నిర్వహించడంతో మద్దిశెట్టి అక్రోశం రెట్టింపైంది. ఎవరికి కావాల్సిందో, ఎవరికి రావాల్సిందో తాను లాక్కో లేదని మద్దిశెట్టి వేణుగోపాల్ ఆగ్రహావేశాలు వెల్లగక్కారు. జగన్‌కు తనపై నమ్మకం ఉన్నంత వరకు ఇక్కడ కొనసాగుతానని, నమ్మకం లేకపోతే మద్దిశెట్టిగానే ఉంటాను తప్ప దర్శిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో జగన్ కోరడంతోనే దర్శి నుంచి పోటీ చేశానని మద్దిశెట్టి వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీంతో దర్శి రాజకీయం మరింత వేడెక్కింది. ఓ వైపు మాజీ ఎమ్మెల్యే, మరో వైపు మాజీ మంత్రి శిద్ధా రాఘరావురావు వైసీపీలో చేరడంతో దర్శి రాజకీయం మరింత వేడెక్కింది.