First Dalit CM : దామోదరం సంజీవయ్య.. జయంతి ఇవాళే. ఆ మహానేత 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో జన్మించారు. దామోదరం సంజీవయ్య దళిత వర్గంలోని మాలదాసు వర్గానికి చెందినవారు. మన దేశంలో తొలి దళిత సీఎం ఈయనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా 1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 12 వరకు సంజీవయ్య సేవలు అందించారు. ఇవాళ దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కీలక విశేషాలను మనం తెలుసుకుందాం..
Also Read :GHMC Jumpings : ‘గ్రేటర్’ స్టాండింగ్ కమిటీ పోల్స్.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బలం ఎంత ?
సీఎం అయినా సింపుల్ జీవితం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి(First Dalit CM) దామోదరం సంజీవయ్య. అయినా ఆయన చాలా సింపుల్‌గా జీవించారు. కొడుకు రాష్ట్రానికి సీఎం అయినా దామోదరం సంజీవయ్య తల్లి సుంకులమ్మ నిరాడంబరంగా జీవించారు. ఆ మాతృమూర్తి వృద్ధాప్య పింఛన్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
Also Read :Telangana Secretariat : ఊడిపడ్డ పెచ్చులు..నిర్మాణ లోపాల పై విమర్శలు
సీఎంగా ఉన్నప్పుడు ఏమేం చేశారంటే..
1952లో మద్రాస్ అసెంబ్లీకి కర్నూలు రిజర్వుడు నియోజకవర్గం నుంచి గెలిచి చిన్న వయసులోనే రాజాజీ కేబినెట్‌లో మున్సిపల్ శాఖ మంత్రిగా దామోదరం సంజీవయ్య పనిచేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1954 మే 7న సికింద్రాబాద్‌కు చెందిన బుచ్చయ్య కూతురు కృష్ణవేణమ్మను కులాంతర వివాహం చేసుకొని అభ్యుదయ భావాలకు బీజం వేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గ సహచరుడుగా పనిచేశారు. 1960 జనవరి 11న 38 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టుకు, కర్నూలు జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్టుకు, గుంటూరు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టుకు సంజీవయ్యే శంకుస్థాపన చేశారు.దళిత విద్యార్థులకు ఉపకార వేతనాలను, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. సంజీవయ్య హయాంలోనే తొలిసారిగా ఏపీలో మద్య నిషేధ విభాగాన్ని, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశారు. గ్రేటర్ మున్సిపల్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడిందీ ఈయన హయాంలోనే. దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ‘లా’ కమిషన్ ఏర్పాటు చేయించారు.
కేంద్ర మంత్రిగా కీలక సేవలు
దామోదరం సంజీవయ్య సీఎం పదవి నుంచి తప్పుకున్న తర్వాత 1964 జనవరి 22న నెహ్రూ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చేశారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1965 మే 29న పార్లమెంట్‌లో బోనస్ చట్టాన్ని తెచ్చి, కార్మికుల ప్రయోజనాలను కాపాడారు. దీంతో ఆయనకు ‘బోనస్ సంజీవయ్య’గా పేరు వచ్చింది. జెనీవా అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించి ఈఎస్‌ఐ చట్టంలో ‘కుటుంబం’ అనే పదాన్ని చేర్చడమే కాకుండా, మహిళా కార్మికుల తల్లిదండ్రులను కూడా పరిధిలో చేర్పించిన గొప్ప వ్యక్తి. సంజీవయ్య 1972 మే 7న అనారోగ్యంతో ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఉన్న అధికారిక నివాసంలో తుదిశ్వాస విడిచారు.