Historic Meeting : ఈ క‌ల‌యిక ఏ తీరాల‌కో..!

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ అల్లుళ్లు డాక్ట‌ర్ ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, నారా చంద్ర‌బాబునాయుడు మ‌ధ్య ద‌శాబ్దాలుగా మాటలు లేవు.

  • Written By:
  • Updated On - December 10, 2021 / 04:26 PM IST

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ అల్లుళ్లు డాక్ట‌ర్ ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, నారా చంద్ర‌బాబునాయుడు మ‌ధ్య ద‌శాబ్దాలుగా మాటలు లేవు. ఏదైనా ఫంక్ష‌న్లో ఎదురుప‌డినా ఎడ‌మొఖం పెడ‌మొఖంగా వెళుతుంటారు. నారా లోకేష్ వివాహం సంద‌ర్భంగా కూడా వాళ్లిద్ద‌రూ మాట్లాడుకున్న దాఖ‌లాలు లేవు. పురంధ‌రేశ్వ‌రి, నారా చంద్ర‌బాబునాయుడు కూడా మాట్లాడుకోరు. నంద‌మూరి కుటుంబంలో జ‌రిగిన అనేక వేడుక‌ల్లో ఇద్ద‌రు అల్లుళ్లు పాల్గొన్న‌ప్ప‌టికీ ఎవ‌రిదోవ వాళ్లదే అనేలా ఉండేది. పైగా చంద్ర‌బాబు ఆలోచ‌న స‌ర‌ళి ద‌గ్గుబాటి వెంక‌ట‌శ్వ‌ర‌రావుకు అస‌లు గిట్ట‌దు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి ద‌గ్గుబాటి దంప‌తులు అన్నీ తామై ఉండే వాళ్లు. పార్టీ ఆవిర్భావం రోజున స్వ‌ర్గీయ ఎన్టీఆర్ తో ఉన్న అల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు మాత్ర‌మే. ఏ విధంగా పార్టీని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లాలో..కూడా ద‌గ్గుబాటి ద‌గ్గ‌రుండి ఎన్టీఆర్ ను న‌డిపించాడు. శిక్ష‌ణా త‌ర‌గ‌తుల్లో ద‌గ్గుబాటి దంపతులు చేసిన త్యాగాన్ని తొలి త‌రం టీడీపీ లీడ‌ర్లు, క్యాడ‌ర్ కు తెలుసు. చంద్ర‌బాబునాయుడు నాయ‌క‌త్వంలోకి టీడీపీ పూర్తిగా వెళ్లేంత వ‌ర‌కు ఉన్నారు. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిమాణాలు వాళ్ల‌ను పార్టీ దూరం చేసుకుంది.

1995లో ఎన్టీఆర్ ను ప‌ద‌వీచ్యుతుడ్ని చేయ‌డానికి చంద్ర‌బాబుకు అండ‌గా ఉన్న వాళ్ల‌లో ద‌గ్గుబాటి కుటుంబం కూడా ఉంది. డిప్యూటీ సీఎంగా వెంక‌టేశ్వ‌ర‌రావుకు ప‌ద‌విని ఆశ‌పెట్టాడని చంద్ర‌బాబు మీద అప‌వాదు ఉంది. సీఎంగా చంద్ర‌బాబు అయిన త‌రువాత‌ ఎలాంటి ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోగా, పార్టీలో చుల‌క‌న చేశాడ‌ని టాక్‌. అందుకే, చాలా కాలం పాటు టీడీపీకి దూరంగా ద‌గ్గుబాటి కుటుంబం ఉంది. అభిమానుల ఒత్తిడి మేర‌కు బీజేపీలో చేరిన‌ప్ప‌టికీ అప్ప‌ట్లో టీడీపీ, బీజేపీ పొత్తు కార‌ణంగా ద‌గ్గుబాటికి ఆ పార్టీలోనూ ప్రాధాన్యం ల‌భించ‌లేదు.విధిలేని ప‌రిస్థితుల్లో 2004 ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ పార్టీలోకి ద‌గ్గుబాటి దంప‌తులు వెళ్లారు. ఎమ్మెల్యేగా వెంక‌టేశ్వ‌ర‌రావు, ఎంపీగా పురంధ‌రేశ్వ‌రి గెలిచారు. కేంద్ర మంత్రిగా పురంధ‌రేశ్వ‌రి కాంగ్రెస్ హ‌యాంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీని విడ‌దీయ‌డాన్ని జీర్ణించుకోలేక పురంధ‌రేశ్వ‌రి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ పార్టీ ఆహ్వానం మేర‌కు ఆ పార్టీలో చేరారు. ప్ర‌స్తుతం బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్నారు. రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌పంచ చ‌రిత్ర‌, స‌మ‌కాలీన రాజ‌కీయాల మీద అనేక పుస్త‌కాల‌ను ఇటీవ‌ల ఆయ‌న ర‌చించారు.
ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వ‌స్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో టీడీపీని బ‌లోపేతం చేయ‌డానికి చంద్ర‌బాబు నేరుగా ఆహ్వానం పంపార‌ని చ‌ర్చ కూడా న‌డిచింది. కానీ, వెంక‌టేశ్వ‌ర‌రావు నుంచి ఎలాంటి రియాక్ష‌న్ వినిపించ‌లేదు.

ప్ర‌స్తుతం టీడీపీ చాలా బ‌ల‌హీనంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లేకుండా పోయింది. ఏపీలోనూ 23 మంది ఎమ్మెల్యేల‌తో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో అంద‌ర్నీ క‌లుపుకుని పోక‌పోతే, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి లాంటి బ‌ల‌మైన శ‌క్తిని అడ్డుకోలేమ‌ని బాబు భావిస్తున్నాడ‌ట‌. అందుకే, వెంక‌టేశ్వ‌ర‌రావును మ‌ళ్లీ పార్టీలోకి తీసుకోవ‌డమే కాకుండా ఆయ‌న కుమారుడికి కూడా కీల‌క ప‌ద‌వి ఇచ్చే ప్ర‌తిపాద‌న పెట్టాడ‌ని పార్టీలో టాక్‌. అయిప్ప‌టికీ చంద్ర‌బాబు వాల‌కం బాగా తెలిసిన వెంక‌టేశ్వ‌ర‌రావు ఆచితూచి వ్య‌వ‌హరిస్తున్నాడ‌ని వినికిడి. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ మ‌నుమ‌రాలు(చిన్న‌కుమార్తె కూతురు) పెళ్లి కూతురైన సంద‌ర్భంగా ఇద్ద‌రూ క‌లిశారు. ప‌క్క‌ప‌క్క‌నే నిలుచుని ఫోటోల‌కు ఫోజులు ఇచ్చారు. ప‌ర‌స్ప‌రం మాట్లాడుకున్నారు. ఈ ప‌రిణామాన్ని గ‌మ‌నిస్తే, రాబోవు రోజుల్లో తెలుగుదేశం పార్టీలోకి మ‌ళ్లీ ద‌గ్గుబాటి రానున్నారు..అనే వార్త‌కు బ‌లం చేకూరుతోంది. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైన జ‌ర‌గ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు.