Purandeswari: గవర్నర్ అబ్దుల్ నజీర్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. గతంలో నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనగా ఉందని నా దగ్గర ఉన్న సమాచారాన్ని అవగాహనతో ప్రజల ముందు ఉంచటం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం RBI, ఇతర FRBI నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఆస్తులను తనఖా పెట్టి వివిధ సంస్థల నుండి అప్పులు చేసిందని ఆమె అన్నారు.
‘‘ఈ అప్పులు తేవడం ఎక్కడి వరకు వెళ్లిందంటే, కార్పొరేషన్లను సృష్టించి అవి ప్రభుత్వ అప్పులు కాదని కార్పొరేషన్ పేరు మీద రుణాలు సేకరించి వాటిని డైవర్ట్ చేస్తూ వచ్చింది. ప్రజల తాగే మద్యం కార్పొరేషన్ ద్వారా ఆదాయం చూపించి రాబోయే కాలంలో ప్రజలు వినియోగించే మద్యాన్ని కూడా చూపించి అప్పులు చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిఎఫ్ ఇతర ఫండ్స్ ను కూడా తీసుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బకాయిలు ఇవ్వనందు వలన ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు’’ అని అన్నారు.
‘‘పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించింది. తెచ్చిన అప్పులకు వడ్డీలు, అసలు తడిపి మోపడై చివరకు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితికి చేరుకుంది’’ అని ఆమె మండిపడ్డారు.