ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్’ తుపాను (Cyclone Remal) కారణంగా..ఏపీలో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం బాగా ముందుకు వచ్చింది. రెమాల్’ తుపాను కాసేపట్లో తీవ్ర తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ లోని కానింగ్ ప్రాంతానికి దక్షిణ ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రాత్రికి పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్ లోని ఖేపుపారా మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
తూఫాన్ కారణంగా ఉప్పాడ బీచ్ లో అలల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈరోజు నీటిమట్టం పెరగడంతో ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చింది. అలలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలుల వీసే అవాకశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కోల్‌కత్తా విమానశ్రయం నుంచి అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె..తెలంగాణ లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలుల బీభత్సానికి ఏడుగురు మరణించారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్లో కోళ్ల ఫారం గోడ కూలి నలుగురు కార్మికులు మరణించారు. అదే జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపాటుకు లక్ష్మణ్ (12) చనిపోయారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట సమీపంలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి బైక్ మీద పడటంతో నాగిరెడ్డి, రామ్ రెడ్డి మరణించారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, నాగోల్, మన్సూరాబాద్, మల్కాజిగిరి, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీ ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Read Also : Telangana : భారీ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర – కేటీఆర్