గులాబ్ క‌ద‌లిక‌ల‌పై వెద‌ర్ బ్లాగ‌ర్ స‌క్సెస్.. విశాఖ వాసి సాయి కిర‌ణ్ కు ప్ర‌శంస‌లు

తుఫాన్ అంటే అంద‌రూ జాగ్ర‌త్త ప‌డ‌తారు. వీలున్నంత వ‌ర‌కు బ‌య‌ట‌కు రాకుండా త‌ల‌దాచుకునే ప్ర‌య‌త్నం చేస్తారు.

  • Written By:
  • Publish Date - September 29, 2021 / 12:35 PM IST

తుఫాన్ అంటే అంద‌రూ జాగ్ర‌త్త ప‌డ‌తారు. వీలున్నంత వ‌ర‌కు బ‌య‌ట‌కు రాకుండా త‌ల‌దాచుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ, విశాఖ‌కు చెందిన వెద‌ర్ బ్లాగ‌ర్ సాయి కిర‌ణ్ మాత్రం బిజీ అవుతారు. ఎప్పుడు తుఫాన్ వ‌చ్చినా…వాతావ‌ర‌ణంలో వినూత్న మార్పులు చోటుచేసుకున్నా..వెంట‌నే కిర‌ణ్ అప్ర‌మ‌త్తం అవుతారు. ఫాలోయ‌ర్స్ కు ఎప్ప‌టిక‌ప్పుడు ఖ‌చ్చిత‌మైన స‌మాచారం అందించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తుంటాడు.
గులాబ్ తుఫాన్ క‌ద‌లిక‌ల‌ను గ‌త 48 గంట‌ల నుంచి క్ష‌ణ‌క్ష‌ణం సాయి కిర‌ణ్ ప‌రిశీలించాడు. నిద్ర‌లేకుండా ఎప్ప‌టిక‌ప్పుడు అనుచ‌రుల‌కు గులాబ్ స‌మాచారాన్ని అందించాడు. క‌ళింగ‌ప‌ట్నం వ‌ద్ద తీరం దాటుతుంద‌ని ముందుగానే అంచ‌నా వేసి అనుచ‌రుల‌కు స‌మాచారం చేర‌వేశాడు. విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన సాయికిర‌ణ్ కు సోష‌ల్ మీడియాలో 2,500 ఫాలోవ‌ర్స్ ఉన్నారు. తొలుత సెప్టెంబ‌ర్ 15న తుఫాన్ గురించి స‌మాచారం అందించారు. ఆ త‌రువాత ఐదు రోజుల‌కు గులాబ్ ను నిర్థారించారు. తొలుత వాతావ‌ర‌ణ శాఖ పూరి,విశాఖ మ‌ధ్య‌న తీరం దాటుతుంద‌ని అంచ‌నా వేసింది. సుమారు 36 గంట‌ల పాలు అధ్య‌య‌నం చేసిన త‌రువాత సాయి కిర‌ణ్ మాత్రం ఉత్త‌రాంధ్ర వ‌ద్ద తీరం దాటుతుంద‌ని చెప్పాడు. గోపాల్ పూర్, క‌ళింగ‌ప‌ట్నం మ‌ధ్య దాటుతుంద‌ని ఫాలోవ‌ర్స్ కు చెప్పిన స‌మాచారం నిజం అయింది.
నిర్మాణ కంపెనీలో ప‌నిచేస్తోన్న సాయి కిర‌ణ్ కు బాల్యం నుంచి మేఘాల క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నిస్తుండేవాడు. వాతావ‌ర‌ణ మార్పుల‌ను అధ్య‌య‌నం చేసేవాడు. గాలి వీచే దిక్కుల‌ను ప‌రిశీలించే వాడు. స్థానికంగా చెట్ల క‌ద‌లిక‌ల‌ను, సముద్ర‌పు చ‌ల‌నాల‌ను నిశితంగా ప‌రిశీలించే వాడు. విశాఖ‌లో హుద్ హుద్ తుఫాన్ చేసిన న‌ష్టం త‌రువాత తుఫాన్ క‌ద‌లిక‌ల‌పై సాయి కిర‌ణ్ అధ్య‌య‌నం చేశాడు. ఆనాటి నుంచి వాతావ‌ర‌ణ మార్పుల‌పై స్నేహితులు, బంధువుల‌కు వాట్సప్ గ్రూపు ద్వారా తెలియ‌చేసేవాడు.
క్ర‌మంగా బ్లాగింగ్ వైపు మ‌ళ్లాడు. వెద‌ర్ బ్లాగ‌ర్ గా సాయికిర‌ణ్ సోష‌ల్ మీడియాకు ప‌రిచ‌యం అయ్యాడు. గులాబ్ తుఫాన్ కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని అనుచ‌రుల‌కు అందించాడు. హుద్ హుద్ కంటే పెద్ద‌ది కాద‌ని అనుచ‌రుల‌కు ముందే చెప్పాడు. భ‌య‌ప‌డ‌కుండా ఉండాల‌ని షోష‌ల్ మీడియాలోని ఫాలోవ‌ర్స్ కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం ఇచ్చాడు. క‌ళింగ‌ప‌ట్నం వ‌ద్ద తీరం దాటుతుంద‌ని సాయి కిర‌ణ్ చెప్పిన‌ట్టే గులాబ్ తీరం దాటింది. వాతావ‌ర‌ణ‌శాఖ కంటే వెద‌ర్ బ్లాగ‌ర్ సాయికిర‌ణ్ గులాబ్ విష‌యంలో వేసిన అంచ‌నా నిజ‌మైంది.