AP HighCourt : వ్య‌భిచారంలో విటులు నేరస్తులు కాదు.!

వ్య‌భిచార గృహానికి వెళ్లిన విటుల‌ను నేర‌స్తుల కింద ప‌రిగ‌ణించ‌డానికి లేద‌ని ఏపీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - May 3, 2022 / 02:31 PM IST

వ్య‌భిచార గృహానికి వెళ్లిన విటుల‌ను నేర‌స్తుల కింద ప‌రిగ‌ణించ‌డానికి లేద‌ని ఏపీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. కేవ‌లం అత‌ను క‌స్ట‌మ‌ర్ కింద మాత్ర‌మే ప‌రిగ‌ణించాల‌ని సూచించింది. విటుడ్ని విచారించ‌డానికి చ‌ట్టం అంగీక‌రించ‌ద‌ని ఏపీ హైకోర్టు భావించింది. ఆ మేర‌కు విటునిపై పెండింగ్ లో ఉన్న కేసును మంగ‌ళ‌వారం విచారించి కొట్టేసింది.

ఈ కేసు పూర్వాపరాలివి, 2020లో గుంటూరు చెందిన వ్యక్తిపై నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి గుంటూరులోని మొదటి తరగతి జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు (ప్రత్యేక మొబైల్ కోర్టు)లో కేసు పెండింగులో ఉంది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. తనపై పెండింగులో ఉన్న కేసును కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. అతడి తరపు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపిస్తూ 10 అక్టోబరు 2020న తన క్లయింటుపై పోలీసులు కేసు నమోదు చేశారని, దర్యాప్తు అనంతరం చార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారని చెప్పారు. వ్యభిచార గృహంపై దాడిచేసినప్పుడు తన క్లయింట్ కస్టమర్‌గా ఉన్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారని వాదించారు.

వ్యభిచార గృహాన్ని నిర్వహించేవారిపైనా, అందుకోసం ఇంటిని ఇచ్చిన వారిపైనా కేసు పెట్టి విచారించవచ్చని న్యాయ‌వాది త‌న వాద‌న వినిపించారు. అంతేకానీ, డబ్బులు చెల్లించి విటుడిగా వెళ్లిన వ్యక్తిని ఎలా విచారిస్తారని ప్ర‌శ్నించారు. చట్టంలోని నిబంధనలు కూడా విటుడ్ని విచారించకూడదనే చెబుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, వ్యభిచార గృహానికి వెళ్లిన కస్టమర్‌పై నమోదైన కేసును గతంలో ఇదే కోర్టు కొట్టేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ కస్టమర్ మాత్రమేనని తెలిపారు. వాదనల అనంతరం న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ దిగువ కోర్టులో పిటిషనర్‌పై ఉన్న కేసును రద్దు చేస్తూ తీర్పు వెల్లడించారు.