ఆంధ్ర‌ప‌దేశ్‌ కాదు..రెడ్డిప్ర‌దేశ్.. కులం కుంప‌ట్లో ప‌వ‌ర్ స్టార్ రాజకీయం

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇక నుంచి ఫ‌క్తు రాజ‌కీయ వేత్త‌గా ఉంటాన‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జా సేవ‌కుడిగా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రించాన‌ని త‌న వ్య‌క్తిత్వం గురించి వివరించే ప్ర‌య‌త్నం చేశాడు.

Published By: HashtagU Telugu Desk

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇక నుంచి ఫ‌క్తు రాజ‌కీయ వేత్త‌గా ఉంటాన‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జా సేవ‌కుడిగా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రించాన‌ని త‌న వ్య‌క్తిత్వం గురించి వివరించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఇచ్చిన ప్ర‌సంగాల‌కు మంగ‌ళ‌గిరిలో జ‌న‌సేన విస్తృత స్థాయి స‌మావేశంలోని స్పీచ్ కు కొంత తేడా క‌నిపిస్తోంది. రాబోయే రోజుల్లో టీడీపీతో పొత్తుకునే విష‌యాన్ని న‌ర్మ‌గ‌ర్భంగా తెలియ‌చేశాడు. క‌శ్మీర్ లోని పండితుల‌తో క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని పోల్చాడు. ఏపీని క‌శ్మీర్ తో పోల్చాడు. అంతేకాదు, దౌర్భ‌గ్య‌మైన ఏపీ కుల రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావించారు. తెలంగాణ కోసం పార్టీల‌కు అతీతంగా పోరాడిన ఘ‌ట్టాన్ని మంగ‌ళ‌గిరి వేదిక‌గా గుర్తు చేశారు. అదే, ఏపీలో ప్ర‌త్యేక హోదా గురించి ఒక పార్టీ నాయ‌కుడు మాట్లాడితే, దాన్ని కులం కోణం నుంచి చూస్తార‌ని అన్నారు.
తెలంగాణ యాస‌, భాష ను కూడా ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. అల్వాల్ అల్వాల్ ఎటు వెళ్లాలి అంటే…ఉల్వ‌ల్ ఉల్వ‌ల్ తింటావా అన్న‌ట్టు ఉంద‌ని వైకాపా వాల‌కాన్ని ఎత్తిచూపారు. ప్ర‌జా వ్య‌తిరేక అంశాల గురించి మాట్లాడితే వ్య‌క్తిగ‌త జీవితాన్ని త‌వ్వుతున్నార‌ని గుర్తు చేశారు. నా జీవితం బ్లాక్ అండ్ వైట్, మీద రంగుల జీవిత‌మంటూ జ‌గ‌న్ మీద సెటైర్ వేశాడు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల ఫ్యామిలీ నుంచి ఆ పార్టీ అధినేత స‌తీమ‌ణి వ‌ర‌కు హామీ ఇస్తున్నానంటూ ఇక జ‌న‌సైనికుల ట్రోల్స్ ఉండ‌వ‌ని హామీ ఇచ్చారు. ప‌రోక్షంగా జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తిని కూడా రాజ‌కీయ సీన్లోకి లాగేలా ప‌వ‌న్ ప్రయ‌త్నం చేశాడు.
అమ‌రావ‌తి రాజ‌ధాని, వెనుక‌బ‌డిన ఉత్త‌రాంధ్ర అభివృద్ధి, రాయ‌ల‌సీమ ప్ర‌గ‌తి కోసం బీజేపీతో క‌లిసి న‌డుస్తున్నాన‌ని వివ‌రించే ప్ర‌య‌త్నం ప‌వ‌న్ చేశాడు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు ఉన్న‌ప్పుడు తానున్నాన‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ఒక రాజ‌కీయ వేత్త‌గా ముందుతున్నాన‌ని వివ‌రించాడు. గెలుపుఓట‌ముల‌తో సంబంధం లేకుండా ప్ర‌జ‌ల వెంట జ‌నసేన న‌డుస్తుంద‌ని అన్నారు. ఓటు వేయ‌మ‌ని ప్రాధేయ‌ప‌డ‌న‌ని ప‌వ‌న్ చెబుతూనే, త‌న మీద న‌మ్మ‌కం ఉంటేనే ఓటు వేయాల‌ని కొత్త పంథాను ఎంచుకున్నారు. అధికారంలోకి వ‌స్తే, అభివృద్ధి అంటే ఏమిటో చూపుతాన‌ని ఆలోచింప‌చేసేలా ప్ర‌సంగించారు.
సంక్షేమ ప‌థ‌కాల రూపంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌న్నుల సొమ్మును దుర్వినియోగం చేస్తుంద‌ని ప‌వ‌న్ ఆరోపించారు. పేద‌ల‌కు సంక్షేమాన్ని అందించ‌డం అంటే ప‌న్ను చెల్లింపుదారుల‌ను దోచుకోవ‌డం కాద‌ని నిల‌దీశారు. ఏపీ బ‌డ్జెట్ 1.25ల‌క్ష‌ల కోట్లు ఉంటే అంత కంటే ఎక్కువ‌గా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఆన్ లైన్
టిక్కెట్ల విధానాన్ని త‌ప్పుబ‌డితే వ్య‌క్తిగ‌త జీవితం మీద‌కు వైసీపీ నేత‌లు రావ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. మ‌ద్యం, ఇసుక‌, సంక్షేమ ప‌థ‌కాలు, నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ గురించి ప‌లు అంశాల‌ను ప‌వ‌న్ లేవ‌నెత్తారు.
ప‌వ‌న్ చేసిన సుమారు గంట ప్ర‌సంగంలో కులాన్ని బాగా రంగ‌రించారు. రెడ్డిప్ర‌దేశ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను మార్చార‌ని దుయ్య‌బ‌ట్టారు. నామినేటెడ్ పోస్టుల్లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఇచ్చిన ప్రాధాన్య‌త‌ను నొక్కి చెప్పారు. అంతేకాదు, కులం మాట‌ను దాక్కునే వాళ్ల‌ను బ‌య‌ట‌కు లాగి కొడ‌తామని హెచ్చ‌రించారు. స‌న్యాసుల‌ను నూనూగు మీసాల యువ‌కులు గొడ‌తార‌ని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. లేడీస్ కు సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌న‌సైనికుల నుంచి భ‌రోసా ఇస్తున్నానంటూ జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తిని ప‌రోక్షంగా రాజ‌కీయ చ‌ద‌రంగంలోకి లాగే ప్ర‌య‌త్నం చేశారు. ఇక మంత్రి పేర్ని నాని, పోసాని మీద ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డారు. ఒక‌సారి మైండ్ లో ఫిక్స్ అయితే వ‌దిలిపెట్టేది లేదంటూ హెచ్చ‌రించ‌డం ఏపీ రాజ‌కీయ‌ల‌ను వేడెక్కించారు.
రాజ‌కీయ క‌మిడియ‌న్ గా ప‌వ‌న్ ను ప‌లుమార్లు వైకాపా నేత‌లు విమ‌ర్శించార‌. యుద్ధం బ‌య‌ట ఉండి ప‌వ‌న్ మాట్లాడుతున్నాడ‌ని చేసిన ఆరోప‌ణ‌ల‌కు ప‌వ‌న్ ధీటైన స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం మంగ‌ళ‌గిరి స‌భ‌లో చేశారు. ఇక నుంచి డైరెక్ట్ ఫైట్ చేస్తాన‌ని జ‌గ‌న్ ను హెచ్చ‌రించాడు. ప్ర‌జా స్వామ్య‌బ‌ద్ధ‌మైన యుద్ధ‌మైనా, లేదా మీరు కోరుకునే ఏ రీతి యుద్ధ‌మైన సై అంటూ ప‌వ‌న్ కాలుదువ్వాడు. 2024 దిశ‌గా అడుగులు వేస్తున్న వైనాన్ని క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశాడు. ఫ‌లితంగా ఏపీలో పొలిటిక‌ల్ హీట్ ను ప‌వ‌న్ త‌న‌దైన స్టైల్ లో రాజేశాడు. గ‌తంలో మాదిరిగా వెంట‌నే చ‌ల్లారి పోతుందా? లేక 2024 వ‌ర‌కు యుద్ధభూమిలో ఇలాంటి ఫైట్ ను ప‌వ‌న్ ఇస్తాడా? అనేది చ‌ర్చ‌నీయాంశం అయింది.

  Last Updated: 30 Sep 2021, 03:05 PM IST