Cyclone Michaung : రైతుల కంట క‌న్నీళ్లు మిగిల్చిన మిచౌంగ్ తుపాను.. ద‌క్షిణ కోస్తాలో తీవ్రంగా దెబ్బ‌తిన్న పంట‌లు

మిచౌంగ్ తుపాను రైతుల‌కు క‌న్నీళ్లు మిగిల్చింది. చేతికొచ్చిన పంట నీళ్లపాలు అవ్వ‌డంతో రైతులు దిక్కుతోచ‌ని స్థితిలో

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 08:26 AM IST

మిచౌంగ్ తుపాను రైతుల‌కు క‌న్నీళ్లు మిగిల్చింది. చేతికొచ్చిన పంట నీళ్లపాలు అవ్వ‌డంతో రైతులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. మిచౌంగ్‌ తుఫాను కారణంగా ఏర్పడిన భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాల్లో పంటలు విస్తారంగా దెబ్బతిన్నాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వ‌రి, హార్టికల్చర్ తోటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లాలో కావలి, వెంకటాచలం, దగదర్తి, కోవూరు, అల్లూరు, ఇనమడుగు, తోటపల్లిగూడూరు, లేగుంటపాడుతో పాటు వివిధ మండలాల్లో 10 వేల ఎకరాల్లో వేసిన వరి దెబ్బతిన్నది. 250 హెక్టార్లలో పచ్చిమిర్చి, బొప్పాయి, ఇతర కూరగాయలతో పాటు 50 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు గత రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కు ముంపునకు గురైంది. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, చిట్టమూరు, వాకాడు, కోట మండలాల్లో 3 వేల హెక్టార్లకు పైగా వరి నీట మునిగింది. జిల్లాలోని ఏర్పేడు తదితర మండలాల్లో ఈదురు గాలులకు అరటి, బొప్పాయి సహా ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఏ మేరకు పంట‌ నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తుపాను కారణంగా 25 ఎకరాల్లో పచ్చిమిర్చి, 25 ఎకరాల్లో అరటితోట, 10 ఎకరాల్లో బొప్పాయి దెబ్బతిన్నాయని, ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అధికారులు లెక్కిస్తారని తిరుప‌తి జిల్లా ఉద్యానవన అధికారి దశరథరామిరెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లాలో 55,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి తోటలు, 9,500 ఎకరాల్లో నిమ్మ తోటలు, 850 ఎకరాల్లో పచ్చిమిర్చి, 450 ఎకరాల్లో పూల పెంపకం, 500 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. చిత్తూరు జిల్లాలో దాదాపు 58 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో 15 వేల హెక్టార్లలో వరి, 40 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారి మురళీకృష్ణ ప్రాథమిక నివేదికలో తెలిపారు. నష్టపోయిన పొలాల్లోని వరదనీటిని బయటకు పంపించడంలో అధికారులు రైతులకు సహాయం చేయడం ప్రారంభించారు. పంట న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని రైతులు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Also Read:  Durga Temple : ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేసిన అధికారులు