11 నెలల్లో తొమ్మిది మందిని బలి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్… ఎక్కడంటే..?

యువకులను బలి తీసుకుంటున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా

  • Written By:
  • Updated On - October 30, 2021 / 12:01 PM IST

యువకులను బలి తీసుకుంటున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా

క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి యువత తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏపీలో 11 నెలల్లో తొమ్మిదిమంది క్రికెట్ బెట్టింగ్లో అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు.బాధితుల్లో ఎక్కువ మంది యువకులు ఉన్నారు.ముఖ్యంగా ఇటీవల జరిగిన ఐపీఎల్ బెట్టింగ్లో భారీగా నష్టపోవడంతో చాలా మంది దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఈ ఏడాది క్రికెట్ బెట్టింగ్ వల్ల జరిగిన మొదటి ఆత్మహత్య ఫిబ్రవరి 28న నమోదైనట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీటెక్ విద్యార్థి సి. కిరణ్ (21) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ తన పాకెట్ మనీతో బెట్టింగ్లు వేయడం మొదలు పెట్టాడు. ఆ తరువాత చిన్నగా తన స్నేహితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్లకు పాల్పడ్డాడు. చివరికి ఆ డబ్బును తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తనలాగా ఎవ్వరూ క్రికెట్ బెట్టింగ్లో పాల్గొని మీ జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని కిరణ్ ఓ నోట్ పెట్టాడు.

ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభంలో ఓ 20 ఏళ్ల యువకుడు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు బానిసైనందుకు ఆ యువకుడిని తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి విజయ్ సాయి(20) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాదాపు ప్రతి ఐపీఎల్ మ్యాచ్లో అతడు తరచూ బెట్టింగ్లలో పాల్గొంటున్నాడని, చదువుకు దూరమై డబ్బులు పోగొట్టుకుంటున్నాడని పోలీసులు తెలిపారు

కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా AP ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన కొద్ది రోజులకే ఏప్రిల్ 28న అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. నంద్యాలలోని మల్దార్పేటలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.తండ్రి, తల్లి, ఇద్దరు పిల్లలు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల లక్షల రూపాయలు పోగొట్టుకున్న మంచ చంద్రశేఖర్ (35), అతని భార్య కళావతి (30), ఇద్దరు కుమార్తెలు – అంజని (15), అఖిల (13)లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

కరోనా కారణంగా ఐపీఎల్ నిలిపివేయడంతో దేశ వ్యాప్తంగా బెట్టింగ్లకు సంబంధించిన ఆత్మహత్యలు ఆగిపోయాయని పోలీసులు తెలిపారు. ఇటీవల సెప్టెంబర్లో తిగిరి ఐపీఎల్ ప్రారంభమైన తరువాత ఆత్మహత్యలు పెరిగినట్లు తెలిపారు.తాజాగా సెప్టెంబర్ 21వ తేదీన నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని తన నివాసంలో 24 ఏళ్ల యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.బెంగళూరులో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న బండ్లపూడి మధు అనే బాధితుడు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు బానిసై పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. మధు చివరిసారిగా బంధువులతో మాట్లాడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.తల్లిదండ్రులు తమ పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్కూల్స్, కాలేజీలకు పంపిచి తమ బాధ్యత అయిపోయిందని చేతులు దులుపుకోకుండా పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని పోలీసులు కోరుతున్నారు.