AP Politics : మెగా బ్ర‌ద‌ర్స్ పై `విలీనం` నీడ‌

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇద్ద‌రూ ర‌క్త సంబ‌ధీకులు.

  • Written By:
  • Updated On - July 19, 2022 / 05:18 PM IST

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇద్ద‌రూ ర‌క్త సంబ‌౦ధీకులు, సొంత అన్న‌ద‌మ్ములు. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా పొస‌గ‌డంలేద‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లోని టాక్‌. ఆ విష‌యాన్ని బ‌ల‌ప‌రుస్తూ తాజాగా సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేకెత్తిస్తున్నాయి. ఊస‌ర‌వెల్లి మాదిరిగా చిరంజీవి ఉంటార‌ని వివాద‌స్ప‌ద కామెంట్స్ చేశారాయ‌న‌. అదే, ప‌వ‌న్ డైన‌మైట్ అంటూ ప్ర‌శంసిస్తూ ఎక్క‌డ పేలుతుందో తెలియ‌దంటూ సెటైర్ వేయ‌డం `మెగా` కుటుంబ‌ అభిమానుల‌కు ఏ మాత్రం రుచించ‌డంలేదు.

సినిమాల‌కు ప‌రిమితం అయినంత వ‌ర‌కు వాళ్ల‌పైన పెద్ద‌గా విమ‌ర్శ‌లు లేవు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌రువాత ప‌లు ర‌కాల ఆరోప‌ణ‌లు `మెగా` కుటుంబ హీరోల‌పై రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం అయింది. ప్ర‌జారాజ్యం పార్టీని 2009లో పెట్టిన చిరంజీవి 18 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకుని ఆ పార్టీని అసెంబ్లీ వ‌ర‌కు తీసుకెళ్లారు. కానీ, ఆ పార్టీని నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయ‌డం విదిత‌మే. ఆ రోజున ప్ర‌జారాజ్యం పార్టీకి యువ‌రాజ్యం అధ్యక్షునిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. పంచ‌లు ఊడ‌దీసి కొట్టాలంటూ దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు ఎన్నిక‌ల సంద‌ర్భంగా గుప్పించారు. ఆనాడు స్టార్ క్యాంపెయిన‌ర్లుగా హీరోలు అల్లు అర్జున‌, అర‌వింద్‌, రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ ఇత‌ర కుటుంబ హీరోలు వ్య‌వ‌హ‌రించారు.

ప్ర‌జారాజ్యం 2.0 రూపంలో జ‌న‌సేన పార్టీ వ‌చ్చింద‌ని తొలి రోజుల్లో ప‌లు ఆరోప‌ణ‌లు ప్ర‌త్యర్థుల నుంచి రావ‌డాన్ని చూశాం. ఇప్పుడు కూడా ఆయ‌న పార్టీ మీద విలీనం నీడ వెంటాడుతోంది. అందుకు కార‌ణం లేక‌పోలేదు. 2019 ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కోల్పోవ‌డంతో పాటు రెండు చోట్ల ఓడిపోయిన ప‌వ‌న్ లెప్ట్ భావ‌జాలాన్ని వ‌దిలేశారు. అక‌స్మాత్తుగా బీజేపీతో పొత్తు పెట్టుకుని రైట్ భావ‌జాలాన్ని అందుకున్నారు. బ‌హుశా ఆ విష‌యాల‌ను అవ‌లోక‌నం చేస్తూ నారాయ‌ణ రెండు ప‌దాల్లో మెగా హీరోల నైజాన్ని ఎండగ‌ట్టారు.

ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి ఇటీవ‌ల భీమ‌వ‌రంలో జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌లో మోడీ ప‌క్క‌న క‌నిపించారు. పైగా ఏపీకి మూడు రాజ‌ధానుల జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించారు. ఇప్పుడు ఆయ‌న బీజేపీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే, ఆయ‌న్ను ఊస‌ర‌వెల్లిగా నారాయ‌ణ సంభోదించ‌డానికి అనువైన ప‌రిస్థితులు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ప‌వ‌న్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. కానీ, రాబోవు రోజుల్లో టీడీపీతో క‌లిసి ప‌నిచేయ‌డానికి సిద్దం అంటూ సంకేతాలు ఇచ్చేశారు. ఇప్ప‌టికే 10 పార్టీల‌తో జ‌త‌క‌ట్టిన జ‌న‌సేనాని మ‌ళ్లీ ఎవ‌రితో ఉంటారో తెలియ‌దన్నంటూ డైన‌మైట్ ఎక్క‌డ పేలుతుందో తెలియ‌దంటూ ప‌వ‌న్ పై సెటైర్ వేశార‌ని నారాయ‌ణ‌. మొత్తం మీద చిరంజీవి, ప‌వ‌న్ వేర్వేరు అనే కోణం నుంచి లాజిక్ తీశారు. ఫ‌లితంగా మెగా హీరోల క‌ల‌యిక (విలీనం) ను నీడ‌లా వెంటాడుతోన్న అనుమానాల‌కు నారాయ‌ణ బ‌లం ఇవ్వ‌డం రాజ‌కీయ‌, సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయింది.