విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి రూ.2,58,64,740లు కానుకలు వచ్చాయి. అంతేకాకుండా శ్రీ కనకదుర్గా అమ్మవారికి 367 గ్రాముల బంగారు ఆభరణాలు, 8.745 కిలోల వెండి ఆభరణాలను భక్తులు హుండీల ద్వారా సమర్పించారు. శ్రీ మల్లికార్జున మహా మండపంలో ఆలయ అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించగా, ఆలయ ఈవో కేఎస్ రామారావు హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. ఈ రోజు (మంగళవారం) కూడా హుండీ లెక్కింపు కొనసాగుతుంది. సోమవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. నరేంద్ర ఆలయాన్ని సందర్శించి శ్రీ కనకదుర్గా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనకు ఘనస్వాగతం పలికి, అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. గత వారం రోజులుగా అమ్మవారి ఆలయానికి భవానీ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భవానీ భక్తులు తమ మాలను విరమణ చేసేందుకు ఇంద్రకీలాద్రి చేరుకుంటున్నారు. ఇరుముడులు సమర్చించి.. అమ్మవారికి మెక్కులు చెల్లించుకుంటున్నారు. భావానీ భక్తుల రాకతో ఆలయం కిటకిటలాడుతుంది.
Also Read: Andhra Pradesh : పార్వతీపురం రైల్వే స్టేషన్‌లోకి వచ్చిన ఏనుగు.. భయాందోళనలో ప్రయాణికులు