YCP Plan : బీజేపీ ప‌న్నాప్ర‌ముఖ్ జ‌గ‌న్ కాపీ! ఎన్నిక‌ల‌కు గృహ‌సార‌థులు!

ఎన్నిక‌ల వ‌ర‌కు ఓట‌ర్ల‌పై గృహ సార‌థులు(House holders) రైడ్ చేసేలా

  • Written By:
  • Updated On - December 10, 2022 / 12:53 PM IST

వైసీపీ(YCP) శాశ్వ‌త అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల కోసం యూపీ, గుజ‌రాత్ రాష్ట్రాల్లో బీజేపీ అనుస‌రించిన‌ `పన్నా ప్ర‌ముఖ్` ప్లాన్ కు పదును పెడుతున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో గెలుపు కోసం బీజేపీ ప్లే చేసిన చ‌తుర‌త‌ను ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏపీలో ప్ర‌యోగించ‌డానికి ఫ్యాన్ పార్టీ(YCP) సిద్ధం అయింది. ఆ క్ర‌మంలో `గృహ‌సార‌థులు`(House holders) అంటూ కొత్త ప‌దాన్ని ఉప‌యోగిస్తూ గ్రామ‌, వార్డు స‌చివాల‌య వాలంటీర్ల‌కు స‌మాంతరంగా `పోల్ మేనేజ్మెంట్` చేసే కార్య‌క‌ర్త‌ల‌ను నియ‌మించ‌నున్నారు. వాళ్ల‌కు గృహ‌సార‌థులు అంటూ నామ‌క‌ర‌ణం చేసి గ్రామాల‌పై వ‌ద‌ల‌డానికి సిద్ధం అయ్యారు. ఎన్నిక‌ల వ‌ర‌కు ఓట‌ర్ల‌పై గృహ సార‌థులు(House holders) రైడ్ చేసేలా ప‌క్కా స్కెచ్ వేశారు. ఇలాంటి పంథానే యూపీ, గుజ‌రాత్ రాష్ట్ర‌ల్లో ప‌న్నాప్ర‌ముఖ్ పేరుతో అనుస‌రించింది.

ప‌న్నా ప్ర‌ముఖ్ అంటే ఏమిటి?
గుజ‌రాత్‌, యూపీ ఎన్నిక‌ల్లో ప్ర‌న్నా ప్ర‌ముఖ్ పేరుతో బీజేపీ కార్య‌క‌ర్త‌లు క్షేత్ర‌స్థాయి ప‌రిణామాల‌ను అధ్య‌య‌నం చేస్తారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓట‌ర్ల అవ‌స‌రాల‌ను ప‌రిశీలిస్తారు. వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వంతో లైజ‌నింగ్ చేయ‌డం ద్వారా ఓట‌ర్ల‌కు ద‌గ్గ‌ర‌వుతారు. ఆ త‌రువాత ఆర్థిక ప‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందేలా ప‌న్నా ప్ర‌ముఖ్ ప్ర‌య‌త్నం చేస్తారు. ఫ‌లితంగా ఓట‌ర్ల‌ను మేనేజ్ చేసే స్థాయికి ఎదుగుతారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రానికి వాళ్ల‌ను తీసుకురావ‌డంతో పాటు పార్టీ అనుకూలంగా ఓటు వేసేలా మేనేజ్ చేయ‌డం ప‌న్నా ప్ర‌ముఖ ప్ర‌ధాని విధి. ఆ విధానం గుజ‌రాత్‌, యూపీ రాష్ట్రాల్లో బీజేపీ విజ‌యం కోసం బాగా ప‌నిచేసింది. ఇప్పుడు ఏపీలోనూ బీజేపీ ఫార్ములాను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ట్టుకున్నారు.

గృహ సార‌థులు నియామ‌కం
ప్ర‌తి 50 ఇళ్ల‌కు ప్ర‌స్తుతం ఒక గ్రామ, వార్డు స‌చివాల‌య వాలంటీర్లు ఉన్నారు. ప్ర‌స్తుతం వాళ్లంద‌రూ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఇళ్ల వ‌ర‌కు అందిస్తున్నారు. దీంతో ల‌బ్దిదారులు అంద‌రూ వాళ్ల‌కు నిత్యం ట‌చ్ లో ఉన్నారు. అంతేకాదు, సాధ‌క‌బాధ‌ల‌ను పంచుకునేలా వ‌లంటీర్లు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. ఆ ప‌రిచ‌యాల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఓట‌ర్ల‌ను సానుకూలంగా మ‌లుచుకోవ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తోంది. కానీ, వాలంటీర్ల మీద ఇప్ప‌టికే ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు విప‌క్షాలు ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్ల సేవ‌ల‌ను ఎన్నిక‌ల్లో ఉప‌యోగించుకోవ‌డానికి వైసీపీకి దాదాపుగా ఉండ‌దు. అందుకే, వాళ్ల స్థానంలో గృహ సార‌థుల‌ను నియ‌మించ‌డానికి ఆ పార్టీ సిద్ధం అయింది. ప్ర‌తి 50 ఇళ్ల‌కు ముగ్గురు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5.2 లక్షల మంది సార‌థుల‌ను నియ‌మించాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అంతేకాదు, 5.2 లక్షల మంది వాలంటీర్లతో పాటు 45 వేల మంది వరకూ కన్వీనర్లను కూడా నియమించబోతున్నారు.

గృహ‌సార‌థుల విధులు
వ్యూహ‌క‌ర్త‌ల‌ను ఎంపిక చేయ‌డం ద్వారా గృహ‌సార‌థుల‌ను నియ‌మించ‌నున్నారు. మేనేజ్మెంట్ కోర్సులు చేసిన విద్యార్థుల‌ను వైసీపీ (YCP) ఆక‌ర్షిస్తోంది. ఓట‌ర్ల‌ను మేనేజ్ చేయ‌డంతో పాటు వాళ్ల‌ను కౌన్సిలింగ్ చేయ‌డం ద్వారా వైసీపీకి సానుకూలంగా మ‌ల‌చ‌డం వాళ్ల ప్ర‌ధాన విధి. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య కొన్ని రోజులు పాటు ఉండాలి. ఆ త‌రువాత వాళ్ల మాన‌సిక‌, కుటుంబ‌, ఆర్థిక‌, సామాజిక పరిస్థితుల‌ను అధ్య‌య‌నం చేయాలి. వాళ్ల వీక్ నెస్ ను తెలుసుకోవాలి. దాన్ని అస్త్రంగా చేసుకుని గృహ‌సార‌థులు ముందుకు క‌ద‌లాలి. ప్రభుత్వ పథకాలు, సొంత అవసరాలు, ప్రభుత్వంలో వ్యక్తిగత పనులు, వ్య‌క్తిగ‌త అవ‌స‌రాలు ఇలా ఏం కావాలో తెలుసుకుని వాటిని నెర‌వేర్చ‌డానికి గృహ‌సార‌థులు ప్ర‌య‌త్నం చేస్తారు. అంతిమ లక్ష్యం ఓటర్లను పోలింగ్ రోజు బూత్ లకు రప్పించి వైసీపీకి అనుకూలంగా ఓటు వేయించుకోవడం గృహ సార‌థుల ల‌క్ష్యం.

ప్ర‌తి 50 కుటుంబాల‌కు ముగ్గురు గృహ సార‌థుల‌ను నియ‌మిండం అంటే స‌గ‌టున 15 కుటుంబాల‌కు ఒక గృహ సార‌థి ఉంటారు. అంటే, ప్ర‌తి 50 మంది ఓట‌ర్ల‌కు ఒక సార‌థి వైసీపీ కోసం క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తార‌న్న‌మాట‌. గ‌తంలో బూత్ స్థాయి క‌మిటీలు ఉండేవి. వాళ్లే పోలింగ్ రోజున కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే వాళ్లు. ఈసారి వ్యూహాన్ని మార్చేశారు. ప‌క్కా బిజినెస్ వ్యూహాలు మాదిరిగా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నానికి అవ‌స‌ర‌మైన డిజైన్ ను వైసీపీ సిద్ధం చేస్తోంది. మార్కెటింగ్ ఎంత బాగుటుందో ప్రొడ‌క్ట్ అంత సేల్ అన్న సూత్రాన్ని న‌మ్ముకుని గృహ సార‌థుల మేనేజ్మెంట్ స్కిల్ ఆధారంగా ఓట్ల‌ను రాబ‌ట్టే ప్ర‌య‌త్నానికి వైసీపీ స‌ర్కార్ తెర‌లేపింది. ఎంత వ‌ర‌కు జ‌గ‌న్మోహ‌న్ స‌రికొత్త ఆలోచ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌నిచేస్తుందో చూడాలి.

Also Read:  YSRCP: వైసీసీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్