Sivaji : సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయన క్షమాపణ చెప్పినా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, దేవాలయాల్లో సాంప్రదాయ దుస్తులు ధరించాలని, మహిళలు జడ వేసుకోవాలని సూచిస్తూ ఓ ఆలయం వద్ద బ్యానర్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ, మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
- మహిళల వస్త్రధారణపై వివాదం
- శివాజీ వ్యాఖ్యల వేళ పోస్టర్ వైరల్
- సోషల్ మీడియాలో పోస్టర్‌పై చర్చ
తెలుగు రాష్ట్రాల్లో మహిళల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆసక్తికర చర్చ జరుగుతోంది. శివాజీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా వివాదం కొనసాగుతోంది. శివాజీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కొందరు.. సమర్థిస్తూ కొందరు స్పందిస్తున్నారు. మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ నడుస్తోంది. మహిళల వస్త్రధారణ ఎలా ఉండాలనే చర్చ అన్నిచోట్ల జరుగుతోంది. శివాజీ వ్యాఖ్యలపై వివాదం నడుస్తున్న సమయంలో ఓ ఆలయం దగ్గర పోస్టర్‌ను ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే ఈ పోస్టర్‌పై చర్చ జరుగుతోంది.
భక్తులకు మనవి.. దేవాలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నుదుటిన కుంకుమ ధరించి, సాంప్రదాయ దుస్తులతో రావాలి. మహిళలు గాజులు లేకుండా, జుట్టు విరబోసుకుని రాకూడదు.. హిందూ సంప్రదాయాన్ని పాటించాలి. మహిళలు తప్పనిసరిగా జడలు వేసుకోవాలని మనవి. దేవాలయ కమిటీ- శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. ‘అవును, ఇలాంటి బ్యానర్స్ అన్ని గుడి, మందిరాలలో పెట్టాలి. వెంట్రుకల్ని జడ వేసుకోవడం మంచి సంప్రదాయం. ప్రతి హిందువు బొట్టు పెట్టు కోవాలి’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అయితే ఈ ఫ్లెక్సీ ‘నరసరావుపేటలో అంట’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచనలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఇలా బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహిళల వస్త్రధారణపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటివి వైరల్ అవుతున్నాయి. అంతేకాదు శివాజీ వ్యాఖ్యలపై కొంతమంది రాజకీయ నేతలు కూడా స్పందించారు. ఎమ్మెల్సీ నాగబాబు శివాజీ వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని చెప్పారు.
నాగబాబు కామెంట్స్
నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు నాగబాబు. ఆడపిల్లలు ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పే హక్కు శివాజీకి లేదన్నారు. మహిళల అత్యాచారాలకు వారి దుస్తులు కారణం కాదని, మగవారి క్రూరత్వమే కారణమన్నారు. ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయాలపై అందరూ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మగవారితో సమానంగా బతికే హక్కు మహిళలకు కూడా ఉందని, ప్రతి ఆడపిల్లను కుటుంబ సభ్యురాలిలా చూడాలన్నారు. ఆడపిల్లలు తమ ఆత్మరక్షణ కోసం ప్రత్యేక విద్య నేర్చుకోవాలని సూచించారు. మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని నాగబాబు అభిప్రాయపడ్డారు. ఆధునిక దుస్తులు ధరించడం తప్పు కాదని, మహిళలపై జరిగే హింసకు వారి దుస్తులు కారణం కాదన్నారు.
