Site icon HashtagU Telugu

Container Hospitals: ఏపీలో కంటైనర్ ఆసుపత్రులు… తొలుత అక్కడే?

Manyam Container Hospitals

Manyam Container Hospitals

మన్యం ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు గురించి మాట్లాడాలంటే, ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. కనీస ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి కూడా చాలానే అగచాట్లు ఎదురవుతున్న గ్రామాలు ఎన్నో గ్రామస్థులు ఎందరో. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇన్నేళ్లు గడిచినా, అడవి బిడ్డల కష్టాలు మాత్రం ఇప్పటికీ మారలేదు. పాలకులు మారినంత మాత్రాన పరిస్థితులు మారేవే కాదు. ముఖ్యంగా, అత్యవసర సమయాల్లో రహదారుల కొరత కారణంగా, ఆస్పత్రులకు పరిగెత్తడానికి డోలీలలో తీసుకెళ్ళే ఘటనలు అనేకం. రోడ్డు సౌకర్యం లేక, అంబులెన్సులు కూడా వెళ్లలేని గ్రామాలకు నేడు డోలీలే అందుబాటులో ఉండడం అనివార్యమైంది. ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సౌకర్యాలు లేకుండా, ఏ విషాద పరిస్థితుల్లోనూ, ఒక గర్భిణీ మహిళతో సహా ప్రజలు ఆడవడలన్ని, నొప్పిని భరించి, గమ్యస్థానానికి చేరుకోవడానికి బలవంతంగా డోలీలలో ప్రయాణిస్తున్నారు.

అయితే ఏజెన్సీ వాసులు, కొండప్రాంతాల వాసులకు ఊరట కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటి ప్రాంతాల్లో కంటైనర్ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని చేస్తోంది. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కంటైనర్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎక్స్ వేదికగా వెల్లడించారు. అనార్యోగానికి గురైన వారిని, ప్రసవాల కోసం గర్భిణులను డోలీలో మోసుకుంటూ.. కొండల నుంచి కిందకు తీసుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేదన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత డోలి మోతలకు స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత సాలూరు మండలం తోణాం పీహెచ్‌సీ పరిధిలోని గిరిశిఖర పంచాయతీ కరడవలసలో కంటైనర్‌ ఆస్పత్రిని నెలకొల్పినట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. ఈ కంటైనర్‌ ఆసుపత్రికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేసినట్లు మంత్రి తెలిపారు, ఈ కంటైనర్‌ ఆసుపత్రిలో వైద్యుడి గది, రోగులకు చికిత్స అందించడానికి నాలుగు బెడ్లతో కూడిన గది, టీవీ, బాల్కనీ ఉన్నాయి. అలాగే 15 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ ఆస్పత్రి ద్వారా సాలూరు మండలంలోని పది గ్రామాల గిరిజనులకు సేవలందనున్నాయి. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కంటైనర్ ఆస్పత్రులను.. ప్రభుత్వ ఆస్పత్రులు లేనిచోట మరికొన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.