Site icon HashtagU Telugu

Terror Links Case: విజయనగరం‌లో పేలుళ్లకు కుట్ర.. సౌదీ, పాక్‌లలో సిరాజ్‌కు ట్రైనింగ్

Vizianagaram Blasts Terror Links Case Siraj Saudi Arabia Pakistan

Terror Links Case: ఉగ్రవాద లింకుల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆ వివరాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైన తాజా విషయాలు

  • విజయనగరానికి చెందిన సిరాజ్ సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లలో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. బాంబులు ఎలా తయారు చేయాలి.. బాంబు పేలుళ్లకు ఎలా ప్లాన్ చేయాలనే అంశాలపై అక్కడే నేర్చుకున్నాడట.   ఈవిషయాన్ని అతడే విచారణలో ఒప్పుకున్నాడని అంటున్నారు.
  • సౌదీ అరేబియాలో ఉన్న ఓ ఉగ్రవాది సూచనల మేరకు సిరాజ్, సమీర్ అండ్ టీమ్ పనిచేస్తున్నట్లు గుర్తించారు.
  • హైదరాబాద్‌లో ఆత్మాహుతి దాడులు చేయాలని సౌదీలో ఉన్న హ్యాండ్లర్ నుంచి సిరాజ్‌కు ఆదేశాలు అందాయట. అయితే విజయనగరంలోని  నాలుగు ప్రాంతాల్లో దాడులు చేస్తానని సిరాజ్ చెప్పాడట.
  • ఆత్మాహుతి దాడులు చేసేందుకు హైదరాబాద్‌, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలోని వివిధ ఏరియాలలో సిరాజ్‌, సమీర్‌ కలిసి రెక్కీ చేశారట.
  • ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 12 మంది గ్రూప్‌గా ఏర్పడ్డారు. అహీమ్‌ అనే ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.  ఈ  ఉగ్రవాద సంస్థలో సిరాజ్, సమీర్ కీలకంగా వ్యవహరించారు. వీరికి సౌదీలో ఉన్న ఉగ్రవాద హ్యాండ్లర్ల నుంచి నిధులు, ప్లానింగ్ అందాయి.
  • ఏకంగా 20 మందికిపైగా యువకులకు సమీర్, సిరాజ్ ఉగ్రవాద శిక్షణ ఇచ్చారని గుర్తించారు. ఆ 20 మంది మానవబాంబులుగా మారేందుకు సిద్ధమయ్యారని వెల్లడైంది. వారందరి సమాచారాన్ని ప్రస్తుతం రాబడుతున్నారు.
  • సికింద్రాబాద్‌‌కు చెందిన సమీర్‌(Terror Links Case) నిత్యం కొందరు యువకులతో సమావేశం అవుతుండే వాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.  హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన పలువురితో అతడు తన ఇంట్లోనే సమావేశాలు నిర్వహించేవాడని చెప్పారు. దీనిపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది.
  • అహీమ్ ఉగ్రవాద సంస్థ సోషల్‌ మీడియా అకౌంట్స్, అహీమ్‌ సంస్థ కార్యకలాపాలు, విదేశాలకు చేసిన ఫోన్ కాల్స్‌పై ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు, పోలీసులు ఆరా తీస్తున్నారు.
  • సిరాజ్ అండ్ టీమ్‌ను తీవ్రవాద భావజాలం దిశగా ప్రోత్సహించిన విశాఖకు చెందిన ఓ రిటైర్డ్‌ రెవెన్యూ అధికారి పాత్రపైనా ప్రస్తుతం ఎన్ఐఏ ఆరా తీస్తోంది.