Site icon HashtagU Telugu

AP Special Status:రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే!

Jairam Ramesh

Jairam Ramesh

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఫైలుపైనే చేస్తానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ విభాగం ఇంచార్జి జైరాం రమేష్ అన్నారు. భారత్ జోడో యాత్ర గురించి కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18న కర్నూలు జిల్లా ఆలూరులో పాదయాత్ర ఉంటుందని తెలిపారు. ఏపీలో 4 రోజుల పాటు 85 కి.మీ. రాహుల్ యాత్ర‌ కొనసాగుతుందని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ అంటే బీఆర్‌ఎస్‌ కాదని, టీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ అవసరమన్నారు. అప్పటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్ సింగ్ ప్రకటించారని,, బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాకుండా పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు చెప్పారని ఆయ‌న గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏం చేశారని ప్రశ్నించారు. జోడో యాత్రకు ఎలాంటి స్పందన వస్తుందోనని బీజేపీ నేతలు భయపడుతున్నారని అన్నారు.

రాష్ట్ర విభజన వల్ల ఏపీ ప్రజలకు నష్టం వాటిల్లిందని మరో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అంగీకరించారు. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు అందుకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యతని, భిన్నత్వంలో ఏకత్వం మన దేశానికి బలమని, దానిని బీజేపీ నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ మళ్లీ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఊమెన్ చాందీ, ఐపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version