AP Politics: ఏపీపై రేణుకా, కేసీఆర్ కాంబినేష‌న్ ?

ఏపీ రాజ‌ధాని అంశాన్ని సానుకూలంగా మ‌లుచుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న అంశాల‌ను నెర‌వేర్చ‌డానికి కాంగ్రెస్ క‌ట్టుబ‌డి ఉంది.

  • Written By:
  • Updated On - September 14, 2022 / 01:12 PM IST

ఏపీ రాజ‌ధాని అంశాన్ని సానుకూలంగా మ‌లుచుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న అంశాల‌ను నెర‌వేర్చ‌డానికి కాంగ్రెస్ క‌ట్టుబ‌డి ఉంది. ఆ విష‌యాన్ని చెప్ప‌డానికి మాజీ కేంద్ర మంత్రి, సీనియ‌ర్ మోస్ట్ కాంగ్రెస్ లీడ‌ర్ రేణుకాచౌద‌రి ఏపీ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె ఏపీ వ్యాప్తంగా స‌భ‌ల‌ను పెట్ట‌డానికి సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు ఏఐసీసీ నుంచి సంకేతాలు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

`బీజేపీ ముక్త్ భార‌త్` నినాదాన్ని వినిపిస్తోన్న కేసీఆర్ కూడా ఏపీ మీద క‌న్నేశారు. జాతీయ పార్టీని ప్ర‌కటించిన త‌రువాత ఆయ‌న ఏపీలోకి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంది. తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌, కర్నూలు ప్రాంతాల్లో స‌భ‌ల‌ను నిర్వ‌హించాల‌ని కేసీఆర్ స‌న్నాహాలు చేస్తున్నట్టు తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. అంత‌కంటే ముందే రేణుకాచౌద‌రి ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి ఏఐసీసీ ఒక ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌హాపాదయాత్ర 2.0 ప్రారంభోత్సవానికి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి హాజ‌రు అయ్యారు. ఆమె రైతుల‌తో కొంత దూరం న‌డుస్తూ సంఘీభావం తెలిపారు.

Also Read:   AP & Telangana : 27న తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల‌తో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మారుతోన్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కూడా అడుగులు వేస్తోంది. రాష్ట్రాన్ని విభ‌జించిన త‌రువాత రెండు చోట్లా న‌ష్ట‌పోయిన కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ పుంజుకోవాల‌ని చూస్తోంది. తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డంతో పాటు ఏపీలో క‌నీస ప్రాతినిథ్యం అసెంబ్లీ వేదిక‌గా సంపాదించుకోవాల‌ని భావిస్తోంది. అందుకే, ఫైర్ బ్రాండ్, ఏపీ ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితురాలిగా ఉన్న రేణుకాచౌద‌రి చ‌రిష్మాను ఉప‌యోగించుకోవాల‌ని కాంగ్రెస్ ఎత్తుగ‌డ వేస్తోంది. ప్ర‌ధాన న‌గ‌రాల్లో కాంగ్రెస్ పార్టీ స‌భ‌ల‌ను నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. ఆ స‌భ‌ల‌కు రేణుక‌ను ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా చూపించాల‌ని అధిష్టానం వ్యూహాల‌ను ర‌చిస్తోంద‌ని స‌మాచారం.

అమరావతి, మూడు రాజధానుల అంశం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ఎజెండాగా అయ్యే అవ‌కాశం లేక‌పోలేదు. ఇప్ప‌టికే మూడు రాజ‌ధానుల దిశ‌గా వేగంగా అడుగులు వేస్తోన్న జ‌గ‌న్ ను నిలువ‌రించ‌డానికి ఏదో ఒక జాతీయ పార్టీ అండ ప్రాంతీయ పార్టీల‌కు ఉండాలి. ప్ర‌స్తుతం ప‌రోక్షంగా బీజేపీ అండ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పుష్క‌లంగా ఉంది. 2019 ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ తో వెళ్లిన చంద్ర‌బాబు ప్ర‌స్తుతం దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం ద్వారా మ‌ళ్లీ బీజేపీ పంచ‌కు చేరుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే, క‌మ్యూనిస్ట్ లు, కాంగ్రెస్ , కొత్త‌గా కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ, ఇత‌ర‌త్రా చిన్నాచిత‌క పార్టీలు ఏక‌మై ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. అప్పుడు ఆ కూటమికి ఐకాన్ గా రేణుకా చౌద‌రి, కేసీఆర్ ఏపీ రాజ‌కీయ చిత్రంలో నిలిచే అవ‌కాశం లేక‌పోలేదు. మొత్తం మీద రేణుకా చౌద‌రి, కేసీఆర్ ఒకే వేదిక‌పై క‌నిపించిన‌ప్ప‌టికీ ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రంలేదు

Also Read:   AP Politics : ఏపీ `గ‌లీజు` పాలి`ట్రిక్స్` కు `శీల‌`ప‌రీక్ష‌