Congress Blowout : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఏపీ రాజకీయాలపై సంచలన కామెంట్లు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ వెనుక కుట్ర కోణం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన్ను రాజమండ్రి జైలుకు పంపడం వెనుక మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందని తేల్చేశారు. ఇండియా కూటమిలోకి చంద్రబాబు వస్తారని భావించడం కారణంగా ఆయన్ను అరెస్ట్ చేసి, జైలుకు పంపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
చంద్రబాబు అరెస్ట్ వెనుక కుట్ర కోణం (Congress Blowout )
జాతీయ స్థాయిలో చంద్రబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన గతంలో నేషనల్ ఫ్రంట్, యూనైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే కూటమిలకు కీలకంగా వ్యవహరించారు. ఆ సందర్భంగా చంద్రబాబుకు వివిధ రాష్ట్రాల్లోని సీఎంలు, మాజీ సీఎంలు, పార్టీల అధిపతులతో స్నేహం ఉంది. ప్రస్తుతం ఇండియా కూటమిలోని నితీష్ కుమార్, మమత, అఖిలేష్ అత్యంత ఆప్తులుగా చంద్రబాబు ఉంటారని బీజేపీ అగ్రనేతలకు తెలుసు. రాజకీయాలకు సంబంధంలేని స్నేహాలు వాళ్ల మధ్య ఉన్నాయి. మాజీ సీఎం మాయవతి కూడా చంద్రబాబు అంటే గౌరవం ఇస్తారు. ఇలా ఇండియా కూటమిలోని ప్రముఖులతో సత్సంబంధాలు ఆయనకు ఉన్నాయి. దీంతో రాబోవు రోజుల్లో చంద్రబాబు రూపంలో రాజకీయ నష్టం ఉంటుందని మోడీ అండ్ టీమ్ భావించారని మధుయాష్కీ(Congress Blowout) చెబుతున్నారు.
జాతీయ స్థాయిలో చంద్రబాబుకు ప్రత్యేక గుర్తింపు
ఇక తెలంగాణలోని కనీసం 40 అసెంబ్లీ స్థానాల పరిధిలో తెలుగుదేశం పార్టీ గెలుపోటములను నిర్దేశిస్తుంది. ఇటీవల ఖమ్మంలో పెట్టిన చంద్రబాబు సభకు పెద్ద ఎత్తన జనం హాజరయ్యారు. ఆ రోజు నుంచి చంద్రబాబును తెలంగాణ వైపు చూడకుండా జాగ్రత్త పడాలని వ్యూహాన్ని కేసీఆర్ రచించారని ప్రగతిభవన్ వర్గాల్లోని చర్చ. అందుకే, సహజ మిత్రునిగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపారని మధుయాష్కీ చేసే ఆరోపణ. ఇద్దరూ కలిసి చంద్రబాబును జైలుకు పంపించారని చెబుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేయలేం. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఓటు బ్యాంకును కలిగి ఉంది. పైగా వెనుకబడిన వర్గాలు ఎప్పుడు ఆ పార్టీని ఆదరిస్తుంటారు. ఏ మాత్రం తెలుగుదేశం పార్టీ బలపడినా బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే, ఆ పార్టీని నిర్వీర్యం చేయాలంటే చంద్రబాబు బయట ఉండకూడదని కేసీఆర్ ప్లాన్ చేశారని టీడీపీ తెలంగాణ విభాగం భావిస్తోంది.అదే విషయాన్ని మధుయాష్కీ (Congress Blowout)బయటపెట్టారు.
Also Read : CBN Skill Development Case : ఏపీ హైకోర్టు లో జరిగిన వాదనలు…
ఏపీలో బీజేపీ, వైసీపీ రాజకీయ ఒకటే. ఆ రెండు పార్టీలు పైకి ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ ఢిల్లీ బీజేపీ పెద్దల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి పుష్కలంగా ఉన్నాయి. వాటి ద్వారానే తాను అనుకున్న విధంగా చంద్రబాబును జైలుకు పంపించగలిగారని ఏపీలోని సామాన్యులు సైతం మాట్లాడుకునే మాట. కేంద్రానికి చెప్పకుండా ఏమీ చేయబోమని నాలుగేళ్ల క్రితమే ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. రాజకీయాలకు అతీతమైన బంధం మోడీతో ఉందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇవన్నీ బీజేపీ, వైసీపీ ఒకటే అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇక జగన్మోహన్ రెడ్డిని 2019 ఎన్నికల్లో గెలిపించడానికి శాయశక్తులా కృష్టి చేసిన లీడర్ కేసీఆర్. వాళ్లిద్దరి మధ్యా అన్నదమ్ముల బంధం ఉంది. అందుకే, ఏపీ ఆస్తులు తెలంగాణ నుంచి తీసుకోలేకపోతున్నాడు జగన్. విద్యుత్ బకాయిలు రూ. 6వేల కోట్లను వదిలేశారు. సచివాలయం కేసీఆర్ కు అప్పగించారు. కాళేశ్వరం , పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను కట్టుకోవడానికి పరోక్ష సహకారం కేసీఆర్ కు జగన్మోహన్ రెడ్డి అందించారు.
Also Read : Women quota bill in LS : మహిళా రిజర్వేషన్ ! దైవం ఇచ్చిన అవకాశమన్న మోడీ!!
కేంద్రంలో మూడోసారి ప్రధాని కావడానికి మోడీ తహతహలాడుతున్నారు. అందుకే, ఇండియా కూటమి బలపడకుండా జాగ్రత్త పడుతున్నారు. అటు వైపు ఎవరు చూసినా ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను వదులుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఫ్రెండ్లీ పార్టీలతో ఏసీబీ, సీఐడీలను ప్రయోగిస్తున్నారని మధుయాష్కీ చేసే ఆరోపణ. ఆ క్రమంలోనే ఏపీ సీఐడీ, ఏసీబీ లను ప్రయోగించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కేంద్ర సహకారంతో చంద్రబాబును జైలుకు పంపారని చెబుతున్నారు. మూడోసారి సీఎం కావాలని కలలు కంటోన్న కేసీఆర్ తెర వెనుక పాత్రను పోషించారని యాష్కీ అంటున్నారు. తెలంగాణలోనూ గతంలో ఏసీబీ, సీఐడీలను కేసీఆర్ ప్రయోగించడం ద్వారా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. అంతేకాదు, జడ్జిలను కూడా ఏసీబీతో ట్రాప్ చేయించారని గుర్తు చేశారు. అలా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని రాజకీయంగా బలపడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం మోడీకి బంటులుగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. ఆయన వేసిన స్కెచ్ ప్రకారం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి చంద్రబాబును జైలు పాలు చేశారని మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇరు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది.