Cock Fight : ఏపీలో జోరుగా సాగుతున్న కోడిపందాలు.. చేతులు మారుతున్న‌ కోట్ల రూపాయ‌లు

సంక్రాంతి సంద‌ర్భంగా ఏపీలో జోరుగా కోడి పందెలు సాగుతున్నాయి. అధికార పార్టీ నేత‌లు బ‌రులు ఏర్పాటు చేసి పందెలు

  • Written By:
  • Publish Date - January 16, 2023 / 12:42 PM IST

సంక్రాంతి సంద‌ర్భంగా ఏపీలో జోరుగా కోడి పందెలు సాగుతున్నాయి. అధికార పార్టీ నేత‌లు బ‌రులు ఏర్పాటు చేసి పందెలు నిర్వ‌హిస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు నిఘాను పెంచినప్పటికీ కోడిపందాల నిర్వాహకులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జోరుగా పందెలు సాగిస్తున్నారు. కోడిపందాలను నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో కోడిపందాలు నిర్వహించడంతో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. బ‌రుల వ‌ద్ద మ‌ద్యం ఏరులై పారుతుంది. ఇటు తెలంగాణ మ‌ద్యం కూడా స‌రిహ‌ద్దులు దాటి బ‌రుల వ‌ద్ద‌కు వ‌స్తుంది. అయిన‌ప్ప‌టికి పోలీసులు చూసిచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కోడిపందెల‌తో పాటు బ‌రుల వ‌ద్ద గుండాట‌, పేకాట‌లు కూడా జ‌రుగుతున్నాయి. బ‌రుల వ‌ద్ద భారీగా జ‌నం వ‌స్తుండ‌టంతో బారికేడ్లు ఏర్పాటు చేసి.. బౌన్సర్లను కూడా మోహరించారు. క్రౌడ్ కంట్రోల్ చర్యల్లో భాగంగా ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. వ్యవసాయ క్షేత్రాల్లో ప్రజలు క్రీడలను వీక్షించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.

కోడిపందాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్‌ వేణుగోపాలకృష్ణ, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ప్రారంభించి కోడిపందాలకు కత్తులు కట్టకుండా సాంస్కృతిక కోడిపందేలు నిర్వహించవచ్చని తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి వచ్చిన వారు పందెం కాస్తున్నారు. ఒక్కో కోడిపై రూ. 10,000 నుండి రూ. 5 లక్షల వరకు బెట్టింగ్ జ‌రుగుతున్నాయి. కోళ్లకు కత్తులు కట్టకుండా సంప్రదాయ పద్ధతిలో నిర్వహించాలనే షరతుతో కొన్ని చోట్ల పోలీసు అధికారులు కోడిపందాలకు అనుమతించినట్లు సమాచారం.అయితే పోలీసులు వెళ్లిన త‌రువాత మాత్రం క‌త్తులు క‌ట్టి పందెలు నిర్వ‌హిస్తున్నారు.