Site icon HashtagU Telugu

TTD Trade Union President: సీఎం వ్యాఖ్య‌లు ఉద్యోగుల‌ను అవ‌మాన‌ప‌ర‌చ‌డ‌మే: టీటీడీ కార్మిక సంఘాల అధ్య‌క్షుడు

Tirumala Weather

Tirumala Weather

TTD Trade Union President: ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూపై చేసిన వ్యాఖ్య‌లు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంటున్నాయి. కొంద‌రు చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తుంటే.. మ‌రికొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు (TTD Trade Union President) కందారపు మురళి స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు.

తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు. టీటీడీలో పారదర్శకమైన విధానాలు అనుసరించబడుతున్నాయని. ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని ఈ ల్యాబ్‌లో తనిఖీలు చేసిన తర్వాతనే వినియోగించబడతాయని ఆయ‌న గుర్తు చేశారు.

సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిఎఫ్టిఆర్ఐ, మైసూరు) పరిధిలో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారని గుర్తు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడపబడుతుందని తెలిపారు. విశ్రాంత శాస్త్రవేత్త, మరో 12 మంది నిపుణులైన ఉద్యోగుల పర్యవేక్షణలో ఈ తనిఖీ జరుగుతుందని ఈ తనిఖీ పర్యవేక్షణకు టీటీడీ నుంచి రోజుకొక బృందం చొప్పున ప్రతిరోజూ సర్టిఫై చేసిన తర్వాతనే ప్రసాదాలకు వినియోగించే ఆహార పదార్థాలను స్వీకరిస్తారని తెలిపారు.

Also Read: Manifesto : రాజకీయ పార్టీ ఎన్నికల హామీని నెరవేర్చకుంటే ఈసీ చర్యలు తీసుకుంటుందా?

తాను సమాచారాన్ని సేకరించిన తరువాతే తెలియజేస్తున్నానని కందారపు మురళి ఆ ప్రకటనలో వివరించారు. టీటీడీ నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటేనే నెయ్యి వినియోగం జరుగుతుందని వివరించారు. కరోనా సమయం మినహా మిగిలిన మూడున్నర సంవత్సరాల కాలంలో నెయ్యి వినియోగానికి సంబంధించిన ట్యాంకర్లు నాణ్యతా ప్రమాణాలకు లోబడి లేవని 20కి పైగా ట్యాంకర్లను తిప్పి పంపిన విషయం రికార్డులలో న‌మోదై ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

వాస్తవం ఇది కాగా ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి తేలికగా ఇట్లాంటి ఆరోపణలు చేయటం సమంజసం కాదని భక్తుల మనోభావాలను, టీటీడీ ఉద్యోగులను అవమానపరిచినట్టే అవుతుందని ఈ సందర్భంగా కందారపు మురళి గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల వినియోగానికి సంబంధించి అక్రమ వ్యవహారాలకు సంబంధించి తప్పులు ఉంటే బాధ్యులను కఠినంగా శిక్షించడానికి ఎవరికీ అభ్యంతరం లేదని, తన ప్రత్యర్థులను దెబ్బతీయాలనే పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేసుకున్న మార్గం సరైంది కాదని.. ఇది భక్తుల మనోభావాలను, ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేదని ముఖ్యమంత్రి గుర్తించాలని కందారపు మురళి విజ్ఞప్తి చేశారు.