Site icon HashtagU Telugu

AP New Districts: కొత్త జిల్లాల‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్.. కీల‌క వ్యాఖ్య‌లు..!

Ys Jagan Ap New Districts

Ys Jagan Ap New Districts

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాలు నేటితో అమ‌లులోకి రానున్నాయి. ఈ క్ర‌మంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను ప్రారంభించారు. దీంతో ఈరోజు నుంచి ఏపీలో 26 జిల్లాల్లో పాలన ఆరంభం కానుంది. ఈ క్ర‌మంలో పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అన‌కాప‌ల్లి జిల్లా, కోన‌సీమ జిల్లా, ఏలూరు జిల్లా, న‌ర‌సాపురం జిల్లా, బాప‌ట్ల జిల్లా, న‌ర‌సరావుపేట జిల్లా, తిరుప‌తి, అన్న‌మ‌య్య జిల్లా, నంద్యాల జిల్లా, శ్రీ స‌త్య‌సాయి జిల్లా, ఎన్టీఆర్ విజ‌య‌వాడ జిల్లాలు ఏర్పాటయ్యాయి.

ఇక పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 23 కొత్త రెవెన్యూ డివిజన్లను ప్రారంభించడంపై ఏపీ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా ఆవిష్కరించిన జిల్లాల్లో అతిచిన్న జిల్లాగా పార్వతీపురం ఉంది. ఈ క్ర‌మంలో ప్రతి జిల్లాలోనూ 3 నుంచి 8 నియోజకవర్గాలున్నట్లు అధికారులు వివరించారు. విస్తీర్ణ పరంగా ప్రకాశం (14,322 చదరపు కిలోమీటర్లు), జనాభా పరంగా నెల్లూరు జిల్లా (24.697లక్షలు) పెద్దవిగా ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లోనూ 8 నియోజకవర్గాలు, 38 మండలాలున్నాయి. జనాభా, విస్తీర్ణంతో పార్వతీపురం మన్యం జిల్లా అతి చిన్న జిల్లాగా ఉంది.

కొత్త జిల్లాలను ప్రారంభించి జ‌గ‌న్, ఆ జిల్లాల అవసరం ఏంటో చెప్పారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లు, గొప్పవాళ్లను పరిగణనలోకి తీసుకున్నాకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని జ‌గ‌న్ తెలిపారు. ఇక పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామ‌ని చెప్పిన జ‌గ‌న్, గతంలోని జిల్లాలు యథాతధంగానే ఉంటాయన్నారు. ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లో 26 జిల్లాలు ఉన్నాయని, ఈ లెక్క‌న ఏపీ జనాభా ప్రతిపాదికన చూస్తే, మన రాష్ట్రానికి జిల్లాల ఏర్పాటు అవసరమ‌ని జ‌గ‌న్ తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రంలో జిల్లాకు ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి లేద‌ని, దాదాపు 4 కోట్ల 96 లక్షల మంది జనాభా ఉన్న ఏపీకి జిల్లాల ఏర్పాటు ఎంతో అవసర‌మ‌ని జ‌గన్ చెప్పారు. ఏపీలో ఇంతకుముందు 38 లక్షల 15 వేల మందికి ఒక జిల్లా ఉండేదని, అయితే ఇప్పుడు 26 జిల్లాల ఏర్పాటుతో 19 లక్షల 7 వేల మందికి ఒక జిల్లా ఉంటుందని జ‌గ‌న్ తెలిపారు. అలాగే గిరిజన జిల్లాల్లో మినహా 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్‌లతో ఒక జిల్లా ఏర్పాటు చేశామన్నారు. కొత్త జిల్లాలతో మెరుగైన పాలనా, శాంతి భద్రతలు, పారదర్శకత ఉంటుందని జ‌గ‌న్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి పరిపాలనపై దృష్టి పెట్టిందని, అందులో భాగంగానే జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు.