Ex CM Rosiah : మాజీ సీఎం రోశ‌య్యపై ద్వేషం..!

మాజీ సీఎం రోశ‌య్య అంటే ఏపీ సీఎం జ‌గ‌న్ కు ద్వేషం? అసెంబ్లీలో సంతాప తీర్మానం ఎందుకు పెట్టలేదు?

  • Written By:
  • Publish Date - March 9, 2022 / 02:44 PM IST

మాజీ సీఎం రోశ‌య్య అంటే ఏపీ సీఎం జ‌గ‌న్ కు ద్వేషం? అసెంబ్లీలో సంతాప తీర్మానం ఎందుకు పెట్టలేదు? రాగ‌ద్వేషాల‌కు అనుగుణంగా జ‌గ‌న్ అసెంబ్లీని న‌డుపుతున్నాడా? ఆర్య‌వైశ్యులంటే జ‌గ‌న్ కు గిట్ట‌దా? చుల‌క‌న భావ‌మా? సంతాపం తీర్మానం పెట్ట‌డానికి జ‌గ‌న్ కు ఏమైంది? మాజీ సీఎం రోశ‌య్య వివాద‌ర‌హితుడు, మేధావి, రాజ‌నీతిజ్ఞుడు, అజాత శ‌త్రువు..కానీ, జ‌గ‌న్ మాత్రం ఆయ‌న్ను చుల‌క‌న‌గా చూస్తున్నాడెందుకు? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఆర్య‌వైశ్యుల్లోనే కాదు..రోశ‌య్య అభిమానుల‌ను తొలిచేస్తున్నాయి.హెలికాప్టర్ ప్ర‌మాదంలో వైఎస్ మ‌ర‌ణించిన త‌రువాత అనివార్య ప‌రిస్థితుల్లో రోశ‌య్య‌ను కాంగ్రెస్ అధిష్టానం సీఎంను చేసింది. ఆ స‌మ‌యంలో సీఎం కావాల‌ని జ‌గ‌న్ కోరుకున్నాడు. ఆ మేర‌కు సుమారు 70 ఎమ్మెల్యేల‌తో సంత‌కాలు కూడా చేయించాడు. కానీ, సీనియార్టీని దృష్టిలో ఉంచుకుని అధిష్టానం రోశ‌య్య‌కు సీఎం ప‌ద‌విని అప్ప‌గించింది. అప్ప‌టి నుంచి రోశ‌య్యకు దూరంగా జ‌గ‌న్ ఉన్నాడు. ఓదార్పు యాత్ర సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ న‌ష్ట‌పోతోన్న విష‌యాన్ని అధిష్టానంకు తెలియ‌చేశాడ‌ని జ‌గ‌న్ కు అనుమానం. అంతేకాదు, మ‌ర‌ణించిన వాళ్ల కుటుంబీకుల‌ను ఒక చోట చేర్చి సానుభూతి తెలియ‌చేయాల‌ని సూచించిన వాళ్ల‌లో రోశ‌య్య కూడా ఉన్నాడ‌ని ఆనాడు జ‌గ‌న్ భావించాడ‌ట‌. పైగా సీఎంగా రోశ‌య్య ఉండ‌గా ఎలాంటి రాజ‌కీయ స‌హాయం జ‌గ‌న్ కు అంద‌లేద‌ట‌. అందుకే, ఆనాటి నుంచి రోశ‌య్య అంటే ఆయన‌కు ప‌డ‌ద‌ని కాంగ్రెస్ లోని కొంద‌రు సీనియ‌ర్లు చెబుతుంటారు.
అసెంబ్లీలో రోశ‌య్య మృతిపై సంతాప తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌ని జగన్ పై ఆర్యవైశ్య జేఏసీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. సంతాప తీర్మానం ప్రవేశపెట్టకపోవడాన్ని ఆర్య‌వైశ్య‌లకు అవమానంగా భావిస్తున్నారు. రోశయ్య అంటే ఎందుకంత కక్ష? అని ప్రశ్నించారు. ఆర్యవైశ్యులు అంటే జగన్ కు చులకనభావం అని విమర్శించారు. జగన్ కు ఆర్యవైశ్యులు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని జేఏసీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. సంతాప తీర్మానం ప్రవేశపెట్టకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించ‌డం గ‌మ‌నార్హం.

రాగ‌ద్వేషాల‌కు అతీతంగా ముఖ్య‌మంత్రులు ఉండాలి. ఆ మేర‌కు ప్ర‌మాణంస్వీకారం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌మాణం చేస్తారు. కానీ, ఏపీ సీఎం జ‌గ‌న్ మాత్రం రాగ‌ద్వేషాల ప్రాతిప‌దిక‌న విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాలు చేస్తున్నాడ‌ని త‌ర‌చూ వినిపిస్తోన్న విమ‌ర్శ‌లు. తాజాగా మాజీ సీఎం రోశ‌య్య సంతాపం అంశం ఆ విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెడుతోంది.చ‌ట్ట‌స‌భ‌ల్లో ప‌నిచేసిన మాజీలు లేదా ప్ర‌స్తుతం విధులు నిర్వ‌హిస్తూ మ‌ర‌ణించిన ప్ర‌తినిధులకు సంతాపం తెలియ‌చేయ‌డం ఆనవాయితీ. అందుకే, ఇటీవ‌ల మ‌ర‌ణించిన మంత్రి గౌత‌మ్ రెడ్డి కి సంతాపం తెలియ‌చేస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆ సంద‌ర్భంగా స‌భ్యులు త‌మ మ‌నోభావాల‌ను, గౌత‌మ్ రెడ్డితో వాళ్ల‌కున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
ఉమ్మ‌డి ఏపీ సీఎంగా ప‌నిచేసిన రోశ‌య్య‌కు మాత్రం సంతాపం తెలియ‌చేసే తీర్మానం ఏపీ అసెంబ్లీలో పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, తెలంగాణ అసెంబ్లీలోనూ రోశ‌య్య మ‌ర‌ణ ప్ర‌స్తావ‌న రాలేదు. కానీ, తెలంగాణ అసెంబ్లీ వాల‌కాన్ని ఆర్య‌వైశ్య జేఏసీ నేత‌లు త‌ప్పుబ‌ట్ట‌లేక‌పోతున్నారు. ఏపీ అసెంబ్లీలో రోశ‌య్య మ‌ర‌ణంపై సంతాపం తెలియ‌చేయ‌క‌పోవ‌డాన్ని ఆర్యవైశ్య జేఏసీ నేతలు సత్యనారాయణ, బాబు నిల‌దీస్తున్నారు. రోశయ్య మరణించినప్పుడు కూడా సీఎం జగన్ నివాళులు అర్పించలేదని ఆరోపిస్తున్నారు.హైద‌రాబాద్ త‌న నివాసంలో మాజీ సీఎం రోశ‌య్య ఇటీవ‌ల మ‌ర‌ణించాడు. ఆ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నుంచి దేశంలోని ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేలా తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నాడు. మూడు రోజుల పాటు సంతాప దినాల‌ను కూడా ప్ర‌క‌టించాడు. స్వ‌యంగా ఇంటికెళ్లి రోశ‌య్య పార్థివ‌దేహాన్ని సంద‌ర్శించి నివాళులు అర్పించాడు. కానీ, తెలంగాణ అసెంబ్లీలో మాత్రం సంతాప తీర్మానం పెట్ట‌లేదు.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం ప‌త్రికాముఖంగా ఆనాడు సంతాపం తెలిపాడు. కానీ, రోశ‌య్య పార్థివ‌దేహం సంద‌ర్శ‌నంగానీ, నివాళులు అర్పించ‌డం గానీ చేయ‌లేదు. ఏపీ అసెంబ్లీలోనూ ఆయ‌న మృతికి సంతాపం తెలుపుతూ తీర్మానం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆ విష‌యాన్ని ఆర్య‌వైశ్య సంఘాలు ప్ర‌త్యేకంగా తీసుకున్నాయి. మంత్రి గౌత‌మ్ రెడ్డికి ప్ర‌వేశ‌పెట్టిన సంతాప తీర్మానంలాగా మాజీ సీఎం రోశ‌య్య మ‌ర‌ణంపై ఎందుకు పెట్ట‌లేద‌ని నిల‌దీస్తున్నారు. అంతేకాదు, రెడ్డి సామాజిక‌వ‌ర్గం ప్ర‌తినిధులు మ‌ర‌ణిస్తేనే అసెంబ్లీలో తీర్మానం ఉంటుందా? అంటూ జ‌గ‌న్ ను నిల‌దీస్తున్నారు.వాస్త‌వంగా మాజీ సీఎం రోశ‌య్య వివాద‌ర‌హితుడు, మేధావి, రాజ‌నీతిజ్ఞుడు, అజాత శ‌త్రువుగా పేరొందాడు. ఉమ్మ‌డి ఏపీలో సీఎంగా ప‌నిచేసిన ఆయ‌న కొద్ది కాలం పాటు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జాద‌ర‌ణ పొందాడు. వైఎస్ అకాల మ‌ర‌ణం త‌రువాత మ‌రో ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డంతో రోశ‌య్య ను కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా చేసింది. ఆ స‌మ‌యంలోనే రాష్ట్ర విభ‌జ‌న‌కు వేగంగా మార్గం సుగ‌మ‌మం అయింది. 2009 నుంచి 2010 మధ్యలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప‌నిచేశాడు. ఆ త‌రువాత 2011 నుంచి 2016 వరకు తమిళనాడు గవర్నర్‌గా ఉన్నాడు. రెండు నెలల పాటు కర్నాటక గవర్నర్‌గా వ్యవహరించాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పని చేశాడు. సుమారు 50 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ వాదిగా అనేక పదవులు చేపట్టాడు.

కొణిజేటి రోశయ్య స్వ‌స్థ‌లం గుంటూరు జిల్లా వేమూరు. అక్క‌డే 1933, జూలై 4న ఆయ‌న జన్మించాడు. గుంటూరు హిందూ కళాశాలలో చదువుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ తరపున తొలుత శాసనమండలికి ప్రాతినిధ్యం వహించాడు. 1968, 1974, 1980లలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. 1985లో ఎన్టీఆర్ శాసనమండలి రద్దు చేసిన తర్వాత తెనాలి నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసాడు. ఆనాటి నుంచి ప‌లువురు ముఖ్యమంత్రుల వ‌ద్ద అనేక శాఖ‌ల‌ను నిర్వ‌హించిన అనుభ‌వ‌జ్ఞుడు.1998లో నరసరావుపేట నుంచి రోశయ్య ఎంపీగా గెలిచాడు. 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. వైఎస్సార్ క్యాబినెట్‌లో కీలక నేతగా వ్యవహరించాడు. అదే సమయంలో మండలి పునరుద్ధరణ తరువాత మరోసారి శాసనమండలికి ఎంపిక‌య్యాడు. వైఎస్సార్ మరణించిన తరువాత, 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశాడు. ఆ తరువాత ఏడాదికే తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యాడు. ఎన్.జి.రంగా శిష్యుడిగా ఆయనకు పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. మొత్తం 15సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టాడు. ఇందులో చివరి ఏడుసార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. అలాంటి గొప్ప రాజ‌కీయ‌వేత్త‌కు అసెంబ్లీలో సంతాప తీర్మానం చేయ‌క‌పోవ‌డం సీఎం జ‌గ‌న్ రాగ‌ద్వేషాల‌తో ఉన్నాడ‌ని తెలియ‌చేస్తోంది.