AP Ek Nath Shinde: ఏపీ `ఏక్ నాథ్ షిండే` ఢిల్లీ ఆప‌రేష‌న్!

చింత‌గుంట మునుస్వామి ర‌మేష్ అలియాస్ సీఎం ర‌మేష్. వృత్తి ప‌రంగా కాంట్రాక్ట‌ర్. రుత్విక్ ప్రాజెక్టు లిమిటెడ్ కంపెనీ ఫౌండ‌ర్. ఆ త‌రువాత తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటీషియ‌న్ గా ఎదిగారు.

  • Written By:
  • Updated On - July 21, 2022 / 03:41 PM IST

చింత‌గుంట మునుస్వామి ర‌మేష్ అలియాస్ సీఎం ర‌మేష్. వృత్తి ప‌రంగా కాంట్రాక్ట‌ర్. రుత్విక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఫౌండ‌ర్. ఆ త‌రువాత తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటీషియ‌న్ గా ఎదిగారు. రెండుసార్లు రాజ్య‌స‌భ‌కు ఆ పార్టీ త‌ర‌పున ఎంపిక‌య్యారు. అధికారంలోకి పార్టీ రాక‌పోవ‌డ‌తో టీడీపీని రాజ్య‌స‌భ వేదిక‌గా విలీనం చేసిన రాజ‌కీయ‌వేత్త కం కాంట్రాక్ట‌ర్ ఆయ‌న‌. ప్ర‌స్తుతం టీడీపీ, బీజేపీ పొత్తు గురించి ఢిల్లీ వేదిక‌గా ప్ర‌య‌త్నం చేస్తోన్న వాళ్ల‌లో ఆయ‌న ఒక‌ర‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని వినికిడి.

సామాజిక‌వ‌ర్గం ప‌రంగా ఆయ‌న తెలంగాణ సీఎం కేసీఆర్ కు స‌న్నిహితుడు. 2009 ఎన్నిక‌ల్లో మ‌హాకూటమిని ఏర్పాటు చేసిన మ‌హానాయ‌కుడు. ఆనాడు కేసీఆర్, చంద్ర‌బాబు మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డంతో పాటు పొత్తుకు కీల‌క భూమిక‌ను పోషించిన బ‌డా కాంట్రాక్ట‌ర్ చింతగుంట మునుస్వామి ర‌మేష్‌. అంతేకాదు, హైద‌రాబాద్‌లోని చంద్ర‌బాబు ఇంటి ప‌క్క‌నే ఆయ‌న నివాసం కూడా అప్ప‌ట్లో ఉండేది. ఆయ‌న‌కు తెలియ‌కుండా టీడీపీలో ఏమీ జ‌ర‌గ‌ద‌న్న నానుడి వినిపించేది. అందుకే, పార్టీలోని కీల‌క లీడ‌ర్లు ఆయ‌న‌తో స‌న్నిహితంగా ఉండే వాళ్లు. ఆ ప‌రిచ‌యాల‌తో కాంట్రాక్ట‌ర్ గా బాగా ఎదిగారు. 2014 ఎన్నిక‌ల్లో సుజ‌నా, ర‌మేష్‌, నారాయ‌ణ తెర‌వెనుక పార్టీకి అండ‌గా నిలిచార‌ని టాక్ ఉండేది. సీన్ క‌ట్ చేస్తే, కేంద్రంలో ఎన్టీయే రాష్ట్రంలో టీడీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత హ‌వాను కొన‌సాగించారు. రాజ్య‌స‌భ ను రెండోసారి కొన‌సాగించ‌డానికి చంద్ర‌బాబు సైతం ఒప్పుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితికి తీసుకెళ్లారు.

ప్ర‌స్తుతం ఆయ‌న బీజేపీలో ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబుకు స‌న్నిహితంగా ఉంటార‌ని త‌ర‌చూ వినిపించే మాట‌. ఆ ప‌రిచ‌యాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డానికి ఆయ‌న‌కు బీజేపీ, టీడీపీ పొత్తు అంశం బాగా అనుకూలిస్తోంది. పైగా అలాంటి ప్ర‌య‌త్నాలు చేసి స‌క్సెస్ అయిన రికార్ట్ ఆయ‌న‌కు 2009లో ఉంది. అందుకే, ఇప్పుడు బీజేపీ, టీడీపీ పొత్తు గురించి ఆయ‌న ఢిల్లీ కేంద్రంగా కీల‌కంగా ఉన్నార‌ని బాహాటంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకు బ‌లం చేకూరేలా కాబోయే `ఏపీ ఏక్ నాథ్ షిండే` సీఎం ర‌మేష్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయంగా ఏపీలో దుమారాన్ని రేపుతోంది.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఒంట‌రిగా టీడీపీ వెళితే 50 నుంచి 60 స్థానాల‌కు మించి గెలుచుకునే ప‌రిస్థితి లేద‌ని కేశినేని అంచ‌నా. అంత‌కు మించిన శ‌క్తి, యుక్తి చంద్ర‌బాబుకు లేద‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. ఆ విష‌యాన్ని మీడియా వ‌ద్ద ఆఫ్ ది రికార్డ్ అంటూ ఆయ‌న ప్ర‌స్త‌వించడం సంచ‌ల‌నానికి దారితీసింది. బీజేపీ, టీడీపీ పొత్తు ఉన్నా, లేకున్నా ఏక్ నాథ్ షిండే మాదిరిగా ర‌మేష్ ను. బీజేపీ ప్లే చేస్తుంద‌ని కేశినేని జోస్యం చెప్పారు. అంతేకాదు, ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు 2024 ఎన్నిక‌ల కంటే 2029 నాటికి ఏపీలో అధికారంలోకి రావాల‌ని రూట్ మ్యాప్ గీశార‌ట‌. ఆ విష‌యాన్ని జ‌న‌సేనానికి కూడా క‌మ‌ల‌నాథులు చెప్పార‌నే విష‌యాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టి చెబుతున్నారు. ఏదో ర‌కంగా టీడీపీని క్లోజ్ చేయ‌డం ద్వారా ఆ స్థానాన్ని బీజేపీ ఆక్ర‌మించాల‌ని రూట్ మ్యాప్ త‌యారైయింద‌ని కేశినేని బ‌య‌ట‌పెట్టారు. ఆ క్ర‌మంలో ఏపీ ఏక్ నాథ్ షిండేగా ర‌మేష్ నిల‌వ‌బోతున్నార‌ని కేశినేని వ్యాఖ్యానించ‌డం పెద్ద దుమారాన్ని రేపుతోంది.

`ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే చంద్రబాబు ఎవరినీ నమ్మడం లేదు. కేవలం బ్రోకర్లు, లోఫర్ల మాటల్నే ఆయన వింటున్నారు` అంటూ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించే శ‌క్తి, యుక్తి చంద్ర‌బాబుకు లేద‌ని కేశినేని చేసిన కామెంట్స్ టీడీపీ వ‌ర్గాల్లో స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీశాయి. ఇదంతా కేశినేని బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య న‌డుస్తోన్న పొలిటిక‌ల్ వార్ క్ర‌మంలో ర‌చ్చ అంటూ కొంద‌రు టీడీపీ లీడ‌ర్లు కొట్టిపారేస్తున్నారు. ఏపీ ఏక్ నాథ్ షిండేగా మారే సీన్ ర‌మేష్ కు ఉందా? అంటూ మ‌రికొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. మొత్తం మీద కేశినేని పేల్చిన పొలిటిక‌ల్ బాంబ్ టీడీపీలో మంట పెడుతోంది.