Site icon HashtagU Telugu

KCR AP Plan : ఆ ముగ్గురితో `బీఆర్ఎస్ ` ఏపీ ఆప‌రేష‌న్ ?

Tummala Talasani Ponguleti

Tummala Talasani Ponguleti

ఎన్నిక‌ల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అంశం ప్ర‌భావం చూపుతుంది. ప్ర‌త్యేక సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ప‌నిచేసింది. సామాజిక ఈక్వేష‌న్ ఏపీ రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపుతుంది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన కేసీఆర్ ఏపీ రాజ‌కీయాల కోసం త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఆ క‌మిటీలో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ ఉంటార‌ని తెలుస్తోంది. ఏపీతో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆ ముగ్గురికి ఏపీ ఆప‌రేష‌న్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించార‌ని తెలుస్తోంది.

సంక్రాంతి నుంచి ఆ ముగ్గురు నేతలు ఏపీలో బీఆర్ఎస్ కోసం వరుస పర్యటనలు చేస్తార‌ని టాక్‌. చాలా కాలంగా కేసీఆర్ కు ఆప్త‌మిత్రునిగా తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఉన్నారు. ఆయ‌న‌కు టీడీపీ క్యాడ‌ర్ తో బ‌ల‌మైన సంబంధాలు ఏపీలోనూ ఉన్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కూడా విస్తృత‌మైన లింకులురెడ్డి సామాజిక‌వ‌ర్గంతో క‌లిగి ఉన్నారు. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ 2019 ఎన్నిక‌ల్లో ఏపీలోకి అడుగు పెట్టారు. అంతేకాదు, సంక్రాంతి సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌తి ఏడాది కోడిపందెల‌కు వెళ‌తారు. ఏపీలోని బీసీ సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్ల‌తో బ‌ల‌మైన సంబంధాల‌ను నెరుపుతారు. ప్ర‌ధానంగా టీడీపీ పూర్వ‌పు లీడ‌ర్లంద‌రూ ఆయ‌న‌కు ట‌చ్ లో ఉంటారు. అందుకే, ఆ ముగ్గురికి స‌మ‌న్వ‌య బాధ్య‌త‌ల‌ను ఏపీ కోసం ఉంచ‌డం ద్వారా ఏపీ ఆప‌రేష‌న్ ను కేసీఆర్ షురూ చేశార‌ని తెలుస్తోంది.

ఉమ్మ‌డి ఏపీ నుంచి పారిశ్రామిక‌వేత్త‌లు ఎక్కువ‌గా హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డ్డారు. వాళ్లంద‌రూ దాదాపుగా కేసీఆర్ తో నేరుగా సంబంధాల‌ను క‌లిగి ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఆంధ్ర పారిశ్రామిక వేత్తలు, వ్యాపార ప్రముఖులతో మంత్రి కేటీఆర్ మ‌మేకం అయ్యారు. ఇవ‌న్నీ ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కలిసి వస్తాయని గులాబీ టీమ్ భావిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా స్థిర‌ప‌డ్డ ఆంధ్రా ఓట‌ర్లు ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ప‌క్షాన నిలిచారు. ప్ర‌త్యేకించి గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో సెటిల‌ర్ల ఓట‌ర్ల‌తోనే టీఆర్ఎస్ బ‌య‌ట‌ప‌డింది.

హైదరాబాద్ తో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన జ‌నం టీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని గులాబీ నేత‌లు గ్ర‌హించారు. ఇక‌ వైసీపీ ముఖ్య నేతలు బీఆర్ఎస్ ను స్వాగతించారు. ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదంటూ విశ్లేషణలు చేస్తున్నారు. దీంతో సంక్రాంతి నుంచి కార్యాచరణ అమలు చేయ‌డానికి కేసీఆర్ సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది.