Site icon HashtagU Telugu

AP Politics : చంద్ర‌బాబుపై `త్రీ`శూలం!

Babu Kcr Modi Jagan

Babu Kcr Modi Jagan

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయంగా స‌హ‌జ మిత్రులు. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును గ‌ద్దె దించ‌డానికి చేతులు క‌లిపారు. హైద‌రాబాద్ నుంచి కేసీఆర్ చేసిన స‌హాయాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్ప‌టికీ మ‌రువ‌లేరు. ఆనాడు ఆర్థికంగా, సామాజికంగా, రాజ‌కీయంగా చేదోడువాదోడుగా కేసీఆర్ నిలిచారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అందించ‌డం ద్వారా చంద్ర‌బాబు నిద్ర‌లేనిరాత్రులు గ‌డిపేలా కేసీఆర్ చేశారు. సీన్ క‌ట్ చేస్తే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డం క‌ళ్ల‌ముందు క‌నిపిస్తోంది.

ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఏపీ సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణం చేశారు. హైద‌రాబాద్ రాజ‌ధానిగా ఇద్ద‌రూ రెండు రాష్ట్రాల‌ను పాలించారు. అయితే, కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ప‌డేసే క్ర‌మంలో ఓటుకునోటు కేసు బ‌య‌ట‌ప‌డింది. అంతే, ఆ రోజు నుంచి కేసీఆర్, చంద్ర‌బాబు మ‌ధ్య రాజ‌కీయ వైరం తారాస్థాయికి చేరింది. ఆ త‌రువాత ఏమైయిందో అంద‌రికీ తెలిసిందే. హ‌ఠాత్తుగా చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌కు మ‌కాం మార్చారు. ఆ రోజు నుంచి చంద్ర‌బాబు నీడ తెలంగాణ మీద ప‌డ‌కుండా కేసీఆర్ జాగ్ర‌త్త ప‌డ్డారు. అయితే 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో జ‌త క‌ట్టి బాబు ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆనాటి నుంచి చంద్ర‌బాబును రాజ‌కీయంగా అంతుచూడాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. రిట‌ర్న్ గిఫ్ట్ మీడియా ముఖంగా ఇస్తాన‌ని వెల్ల‌డించారు. అప్ప‌టి నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కి స‌న్నిహితంగా మెలుగుతూ అన్నీ తానై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సీఎం చేయ‌గ‌లిగారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన డేటా సెంబ‌ర్లు హైద‌రాబాద్ లోనే ఉండేవి. ఏపీ సీఎంగా చంద్ర‌బాబు ఉన్న‌ప్ప‌టికీ ఆనాడు అన్నీ హైద‌రాబాద్ కేంద్రంగా జ‌రిగేవి. ప్ర‌తి క‌ద‌లిక మీద కేసీఆర్ స‌ర్కార్ క‌న్నేసింది. ఏపీ ఓట‌ర్ల‌కు సంబంధించిన డేటా సెంట‌ర్ల మీద తెలంగాణ సీఐడీ అప్ప‌ట్లో సీజ్ చేసింది. ఆర్థిక లావాదేవీలు జ‌ర‌గ‌కుండా ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌ట్ట‌డీ చేయ‌గ‌లిగింది. చంద్ర‌బాబు పాల‌న మీద ప్రెస్మీట్ల రూపంలో కేసీఆర్ నిరంత‌రం దాడిచేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వైసీపీకి అస్త్రాల‌ను అందించారు. ఒక వైపు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇంకో వైపు కేసీఆర్ మ‌రో వైపు మోడీ రాజ‌కీయ దాడికి చంద్ర‌బాబు రాజ‌కీయంగా కుప్ప‌కూలారు. ఆ ముగ్గురి ఉమ్మ‌డి శ‌త్రువుగా చంద్ర‌బాబు మిగిలారు.

మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డానికి చంద్ర‌బాబు మూడేళ్లుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంపై పోరాడుతున్నారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న స‌మ‌యంలో మ‌ళ్లీ కేసీఆర్ జాతీయ పార్టీ రూపంలో ఎంట్రీ ఇస్తున్నారు. ఇదంతా కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, మోడీ క‌లిసి న‌డిపిస్తోన్న రాజ‌కీయ నాట‌కంగా కొంద‌రు భావిస్తున్నారు. ఉమ్మ‌డి శ‌త్రువుగా ఉన్న చంద్ర‌బాబును ఏపీ రాజ‌కీయ చ‌ద‌రంగం మీద క‌నిపించ‌కుండా చేయ‌డానికి స‌రికొత్త ఎత్తుగ‌డ మొద‌ల‌యింద‌ని ప్ర‌చారం జరుగుతోంది. కాపు, బీసీ, వెల‌మ, ముస్లిం లీడర్ల‌తో కూట‌మి క‌ట్ట‌డానికి కేసీఆర్ జాతీయ పార్టీ సిద్ధం అయింది. పైగా స్వ‌ర్గీయ ఎన్టీఆర్ హ‌యాం నుంచి తెలుగుదేశం పార్టీలో స‌న్నిహితంగా ఉండే వాళ్లు చాలా మంది కేసీఆర్ కు ఉన్నారు. మునుగోడులో క‌మ్యూనిస్ట్ ల‌తో చేతులు కలిపిన‌ కేసీఆర్ అదే ఈక్వేష‌న్ తో ఏపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ధం అయ్యార‌ని తెలుస్తోంది.

తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తు దాదాపుగా ఖాయం అయింద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. కానీ, హ‌ఠాత్తుగా కేసీఆర్ ఎంట్రీతో జ‌న‌సేన కూడా కేసీఆర్ తో క‌లిసి న‌డిచే అవ‌కాశం లేక‌పోలేదు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, జ‌న‌సేన‌, క‌మ్యూనిస్ట్ ల‌తో ఏపీలో మ‌హా కూట‌మి ఏర్పాటుకు కేసీఆర్ సిద్దం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, వైసీపీ, టీడీపీలోని అసంతృప్తి వాదులు, రెబ‌ల్స్ కేసీఆర్ పార్టీ వైపు చూస్తున్నార‌ట‌. తెలుగుదేశం పార్టీలోని సీనియ‌ర్లు చాలా మంది కేసీఆర్ తో ట‌చ్ లోకి వెళ్లార‌ని ప్ర‌చారం జరుగుతోంది. ఇదంతా ఉమ్మ‌డి శ‌త్రువుగా క‌నిపిస్తోన్న చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ మోడీ, కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌లిసి ఆడుతోన్న గేమ్ గా ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు వినిపిస్తోంది. ఇలాంటి విప‌త్క‌ర రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను చంద్ర‌బాబు ఎలా అధిగ‌మిస్తారో చూడాలి.