CM Jagan: ఢిల్లీకి సీఎం జ‌గ‌న్ .. 5న ప్ర‌ధాని మోదీ, అమిత్ షాల‌తో భేటీ.. టీడీపీకి బిగ్ షాక్ త‌ప్ప‌దా?

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జూలై 4న ఢిల్లీ వెళ్ల‌నున్నారు. జూలై 5న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో భేటీ కానున్నారు.

  • Written By:
  • Updated On - July 1, 2023 / 08:41 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఢిల్లీ(Delhi) కి వెళ్ల‌నున్నారు. జూలై 4వ తేదీన ఢిల్లీకి వెళ్ల‌నున్న సీఎం.. 5వ తేదీన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Narendar Modi) తో స‌మావేశం అవుతారు. అదేరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Minister Amit shah) తో పాటు, ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో జ‌గ‌న్ భేటీ కానున్నారు. మ‌రో ఏడాదిలో లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మూడోసారి దేశంలో అధికారంలోకి వ‌చ్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇదే స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా ఎన్డీయేయేత‌ర పార్టీలు కూట‌మిగా ఏర్ప‌డుతున్న స‌మ‌యంలో ఎన్డీయేను విస్త‌రించేందుకు బీజేపీ అధిష్టానం దృష్టిపెట్టింది.

గ‌తంలో ఎన్డీయే ప‌క్ష పార్టీల‌ను క‌లుపుకొని వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల చంద్ర‌బాబుతో జేపీ న‌డ్డా, అమిత్ షాలు భేటీ అయ్యారు. దీంతో ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయ‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ సైతం బీజేపీ మ‌న‌కు దూర‌మైన‌ట్లేన‌ని చెప్పారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాల‌ను క‌లిసేందుకు ఢిల్లీకి వెళ్ల‌నుండ‌టం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎన్డీయే విస్త‌ర‌ణ‌లో భాగంగా ఏపీలో టీడీపీతో కాకుండా వైసీపీతో క‌లిసి వెళ్లేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధ‌మైందా అనే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. మ‌రోవైపు జూలై 20 పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో ప‌లు బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ స‌మ‌యంలో వైసీపీ మ‌ద్ద‌తు తీసుకొనేందుకు జ‌గ‌న్‌తో మోదీ, అమిత్ షా చ‌ర్చిస్తార‌న్న చ‌ర్చ‌కూడా జ‌రుగుతుంది. అలాకాకుండా, రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై సాధార‌ణ భేటీలో భాగంగా ప్ర‌ధాని మోదీ, అమిత్ షాతో జ‌గ‌న్ భేటీ అవుతున్నార‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి ఎన్డీయే విస్త‌ర‌ణ‌కు బీజేపీ అధిష్టానం దృష్టిసారించిన నేప‌థ్యంలో వై.ఎస్‌. జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీ, అమిత్ షాల‌తో భేటీ కానుండ‌టం ఏపీ రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మ‌రోవైపు వివేకా హత్య కేసులో సీబీఐ తాజా చార్జిషీట్ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

 

BJP MP Laxman : నాయకత్వ మార్పు గురించి పార్టీలో చర్చ జరగలేదు.. తెలంగాణలో బీజేపీ విజ‌యం ఖాయం