Site icon HashtagU Telugu

CM Jagan Flood Tour: అప్పుడు వచ్చుంటే అధికారులు నా చుట్టూ తిరిగే వాళ్లు: సీఎం జగన్

Cm Jagan

Cm Jagan

ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలని ఏపీ సీఎం వై యస్ జగన్ వ్యాఖ్యానించారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వరద ప్రాంతాల్లో ఆయన ఇవాళ పర్యటించారు. ఇటీవల గోదావరి వరదలకు ముంపుకు గురయిన గ్రామాల్లో పర్యటించి సహాయక చర్యల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. అరిగెలవారి పేటకు, పుచ్చకాయలవారి పేటకు, ఊడుమూడి లంకలో వరద బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ కౌంటర్ ఇచ్చారు. డ్రామాలు చేస్తే ప్రజలకు మంచి జరగదన్నారు. వరదల్లో తాను వచ్చి ఉంటే అధికారులు తన చుట్టూ తిరిగేవాళ్లనీ, అందుకే అధికారులకు వారం టైం ఇచ్చి తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు.

బాధితుల౦దరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదన్నారు. వరద బాధితులందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శిబిరాల్లో బాగా చూసుకున్నారా అంటూ బాధితులను సీఎం అడిగారు. వాలంటీర్లు బాగా పనిచేశారని బాధితులు సిఎంతో అన్నారు. మీ కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చని గ్రామస్తులను సీఎం అడిగి తెలుసుకున్నారు. వరదలు రాగానే ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తక్షణ సహాయ కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. వెంటనే అధికారులందరినీ క్షేత్రస్థాయిలోకి పంపామని, ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. జి. పేదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని సీజన్‌ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. ఇదిలా ఉంటే.. వర్షంలోనూ సీఎం జగన్‌ ఆగకుండా తన పర్యటనను కొనసాగించారు.