AP Kapu Politics; జనసేనాని పవన్ దూకుడుకు చెక్ పెట్టేలా జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. ముద్రగడను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది. ఆయన్ను కాకినాడ ఎంపీగా ఎన్నికల బరిలోకి దింపాలని స్కెచ్ వేసినట్టు తాడేపల్లి వర్గాల్లోని టాక్. ఈ నెల 14 నుంచి పవన్ వారాహి ద్వారా ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఆ మేరకు జనసేన బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇదే సమయంలో ముద్రగడ వ్యవహారం తెరమీదకు వైసీపీ తీసుకొచ్చింది. కొందరు వైసీపీ కాపు నేతలు ఆయనతో భేటీ కావటం రాజకీయ చర్చకు దారి తీస్తుంది. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో తునిలో రైలుకు నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించిన కేసులతో ముద్రగడ బాగా ఇబ్బంది పడ్డారు. ఇటీవల జగన్ ప్రభుత్వం ఆ కేసులన్నింటినీ ఎత్తివేసింది. ఇదే టైంలో వైస్సార్సీపీ కాపు నేతలు ముద్రగడతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.
రాజకీయ కోణంలో ఆసక్తికర భేటీ జరిగింది. ఎన్నికల వేళ అధికార పార్టీ కాపు నేతలతో ముద్రగడ పద్మనాభం సమావేశం కావడం హైలైట్ అవుతుంది. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లిన నేతలు ఆయనతో అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పలువురు ఎంపీపీలు, కాపు నేతలు ముద్రగడను కలిసిన లీడర్లలో ఉన్నారు. ఈ విందు రాజకీయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
ముద్రగడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడని పక్షంలో ఆయన కుమారుడికే టిక్కెట్ ఇస్తారని వైసీపీలోని వినికిడి. కుమారుడికి అసెంబ్లీ, ముద్రగడకు లోక్ సభ సీటు ఆఫర్‌పై సంతోషం వ్యక్తం చేశారని, ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలా వద్దా అనే విషయంపై తన కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వైఎస్సార్‌సీపీ నేతలకు తెలిపినట్లు సమాచారం. గత కొంత కాలంగా ముద్రగడ వైఎస్సార్‌సీపీ నేతలతో టచ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని ఆయన ఇటీవల ప్రకటన చేశారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని ముద్రగడ పద్మనాభం తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. కాపు సామాజికవర్గ ప్రజలకు ఉద్దేశించి రాసిన లేఖలో తుని రైల్వే కేసు కొట్టివేసినందున సత్యం జయించిందని సంతోషం వ్యక్తం చేశారు. తన జాతి రిజర్వేషన్ జోకర్ కార్డులా మారినందుకు బాధపడుతున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 2016 వ సంవత్సరం ఫిబ్రవరి 2 వ తేదీన తనను తీహార్ జైలుకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ రెడీగా పెట్టారని.. బెయిల్ తెచ్చుకోండి, లేదా అండర్ గ్రౌండ్ కి వెళ్ళమని సలహాలు ఇచ్చారన్నారు
గతంలో రిజర్వేషన్ల కోసం తీవ్ర ఉద్యమం చేసినా ఈ ప్రభత్వంపై ఆయన సాఫ్ట్ గా ఉన్నారు. ఎలాంటి ఉద్యమం చేయలేదు. గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు చెల్లుతాయని కేంద్రం చెప్పినా ముద్రగడ పెద్దగా స్పందించలేదు. రద్దు చేసిన ఐదు శాతం రిజర్వేషన్లను పునరుద్దరించాలని ఆయన ఎలాంటి ఉద్యమం చేయలేదు. దీంతో ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
గోదావరి జిల్లా మీద ఆశ పెట్టుకున్న పవన్ కు గండి కొట్టేలా వైసీపీ ముద్రగడను రంగంలోకి లాగుతుందని తెలుస్తుంది. ఈ దెబ్బతో పవన్ కు ఉన్న కాపు ఓటు బాంక్ కూడా పోతుందని వైసీపీ అంచనా. ఒక వేళ టీడీపీ తో పొత్తు పెట్టుకున్నా నష్టం జరగ కుండా ముందస్తు జాగ్రత్త పడుతున్నారు జగన్. ఆయన వ్యూహం ఫలిస్తే ముద్రగడ కుటుంబం జగన్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
Read More: Vijayawada TDP : వైసీపీ నేత సొమ్ముతో టీడీపీ నేత సోకులు.. ఇద్దరి టార్గెట్ ఇదేనట..?