ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయపార్టీలు 2024 ఎన్నికలు టార్గెట్‌గా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు క్రిస్టల్ క్లియర్‌గా క్లారిటీ ఇచ్చిన జగన్ తాజాగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఉన్న కింది స్థాయి కార్యకర్తలతో చర్చలు షురూ చేయనున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు కావొస్తున్నా, పార్టీ కార్యక్రమాలపై జగన్ సరిగ్గా దృష్టి పెట్టలేదు.
ఇప్పటి వరకు కేవలం సంక్షేమ పథకాల అమలుపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన జగన్, ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అన్నీ పార్టీలు ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు.
ఈ నేపధ్యంలో మూడేళ్ల తర్వాత నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశంలో టికెట్ల కేటాయింపు, మంత్రివర్గ కూర్పుపై జగన్ కుండబద్ధలు కొట్టేశారు. పని చేసిన వారికి, ప్రజల్లో మంచి పేరు ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని జగన్ తేల్చి చెప్పేశారు. ఇప్పటికే అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని జగన్ చెప్పడంతో, పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది.
ఇక ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే, గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలకపాత్ర పోషించిన కింద స్థాయి కార్యకర్తలను నేరుగా కలుసుకునేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టిన జగన్ అప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ప్రతి రోజూ ప్రజలను కలుసుకుంటూ, కార్యకర్తలతో సమావేశం అయ్యేవారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితం అయ్యారు.
అంతే కాకుండా ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనే అపవాదు ఉంది. ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు పార్టీపైనే ఫోకస్ పెడుతున్నారు జగన్. కార్యకర్తలతో పాటు నేతల్లో ఉన్న అసంతృప్తిని కూడా పొగొట్టేందుకు జగన్ రెడీ అయ్యారు. రెండేళ్లలో పార్టీపైన స్పెషల్ ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్న జగన్, ఇందుకోసం రెండు రోజుల పాటు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో వారిని నేరుగా తాడేపల్లికే పిలిపించుకుని మాట్లాడేందుకు రంగం సిద్ధం చేశారు.
ఇకపోతే అధికారం కంటే కూడా పార్టీ ముఖ్యమనే విషయం ప్రతి రాజకీయ నేతకు తెలుసు. అధికారం మత్తులో పార్టీని పక్కన పెడితే ఏం జరుగుతుందో ఇప్పటికే చాలా ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి రాకుండా జగన్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. నేతల్లో ఉన్న అతివిశ్వాసాన్ని పక్కన పెట్టేందుకు స్వయంగా జగనే రంగంలోకి దిగనున్నారు. అధతికారంలో ఉన్నాం కదా అని అప్రమత్తంగా లేకపోతే ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయరనే విషయాలపై కార్యకర్తలకు వివరించనున్నారు జగన్. ఏది ఏమైనా 2024 ఎన్నికలే టార్గెట్‌గా జగన్ రంగంలోకి దిగుతున్నారని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.