Site icon HashtagU Telugu

CM Jagan: సంక్షేమ పాలన కావాలా…దోచుకు తినే ప్రభుత్వం కావాలా ? కాపునేస్తం సభలో సీఎం జగన్ కామెంట్స్‌

Cm Jagan

Cm Jagan

ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం అమలు చేసింది. ఈ పథకంలో భాగంగా కాపు మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా బటన్‌ నొక్కి మూడో విడత నిధులను విడుదల చేశారు. 3 లక్షల 38 వేల 792 మంది లబ్ధిదారులకు… 508 కోట్ల 18 లక్షల 80వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు. ఈ మూడేళ్ళ కాలంలో కాపు నేస్తం పథకం క్రింద 1500 కోట్ల రూపాయలను కాపు కార్పోరేషన్ ద్వారా అందించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది మనసున్న ప్రభుత్వం కాబట్టే మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్‌ కాపునేస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి చెప్పారు. కాపు,బలిజ, ఒంటరి, తెలగ కులాల వారికి తోడుగా ఉండటానికి ఈ గొప్ప కార్యక్రం అమలు చేస్తున్నట్లు చెప్పారు.తాము డైరెక్ట్‌ బెనిపిట్‌ ట్రాన్స్‌ఫర్‌ పథకాలతో ప్రజలకు నేరుగా సంక్షేమాన్ని అందిస్తుంటే ప్రతిపక్షాలు డీబీటీకి వక్ర భాష్యాలు చెబుతున్నాయని అన్నారు. కాపులకు ఏటా వెయ్యి కోట్ల బడ్జెట్‌ పెడతానని చెప్పిన పెద్దమనిషి కనీసం రూ.1500కోట్లను కూడా ఇవ్వలేదని చంద్రబాబును ఉద్దేశించి ఆరోపించారు. చంద్రబాబు వాగ్ధానాలు మోసాలలో అది కూడా కలిసిపోయిందన్నారు. ఐదేళ్లలో పదివేల కోట్ల మించి లబ్ది కలిగిస్తామని చెప్పి మూడేళ్లలో రూ.32,296కోట్ల లబ్ది కలిగించామని చెప్పారు. పేదలపై తమకు ఉన్న ప్రేమ, చిత్తశుద్ధిలకు ఇదే నిదర్శనమన్నారు.

చంద్రబాబు పాలనలో డీపీటీ అంటే.. దోచుకో.. పంచుకో.. తినుకో అని సీఎం జగన్‌ నిర్వచించారు. డీపీటీ ద్వారా దుష్టచతుష్టయం చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. వీరికి తోడు దత్తపుత్రుడు అంతా కలిసి సామాజిక న్యాయం పాటించారని ఎద్దేవా చేశారు. కాపుల ఓట్లను మూటగట్టి చంద్రబాబుకు అమ్మడానికి దత్త పుత్రుడు ప్రయత్నిస్తున్నాడని సీఎం విమర్శలు గుప్పించారు. మన ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం కావాలా? చంద్రబాబు హయాంలో ఉన్న దోచుకో, పంచుకో, తినుకో కావాలా?..తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. వరద బాధితులు ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా రేషన్‌తో పాటు ప్రతీ ఇంటికి రూ.2 వేలు ఇస్తున్నామనీ, చంద్రబాబు తన పాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేకపోయారన్నారు.

Exit mobile version