Site icon HashtagU Telugu

Jagan Target 2024: రూ.1.37 లక్షల కోట్లు పంచినా.. సీఎంగా జగన్ కు 65 శాతం మద్దతేనా?

Modi Jagan Kcr

Modi Jagan Kcr

ఏపీ సీఎం జగన్ కు తమ ప్రభుత్వ పరిస్థితి ఏమిటో బోధపడిందా? ఇప్పటికే రూ.1.37 లక్షల కోట్లిచ్చినా సరే.. సీఎంగా జగన్ కావాలని కేవలం 65 శాతం మందే ఎందుకు కోరుకుంటున్నారు? తమ ఎమ్మెల్యేనే మరోసారి ఎమ్మెల్యేగా అవ్వాలని కేవలం 40-45 శాతం మందే ఎందుకు కోరుకుంటున్నారు? పైగా వచ్చే రెండేళ్లలో మరో రూ.లక్ష కోట్లు ప్రజలకు ఇవ్వడానికి సర్కారు సిద్ధమవుతోంది. అయినా ఎందుకు ప్రజల్లో
పట్టు సాధించలేకపోతోంది?

2019 ఎన్నికల్లో మొత్తం 151 సీట్లను గెలుచుకుని తిరుగులేని రికార్డును నెలకొల్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈసారి 175కు 175 సీట్లూ గెలుచుకోవాలని భావిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. ఇలా కోరుకోవడంలో తప్పులేదు. అలాంటప్పుడు ప్రజల ఆశీర్వాదం కూడా అలాగే ఉండాలి. మరి ఆ స్థాయిలో ఆశపడుతున్నప్పుడు ప్రజల మద్దతు 65 శాతం దగ్గరే ఎందుకు ఆగిపోయిందన్నది ప్రశ్న.

నిజానికి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాల రూపంలో ఏపీలో డబ్బులను పంచుతున్నారు. అభివృద్ధి కన్నా.. సంక్షేమమే ఎక్కువవ్వడంతో అప్పుల కుప్పలు పేరుకుపోతున్నాయి. చివరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఆలస్యం చేయాల్సి వస్తోంది. ఖజానాలో డబ్బులుండడం లేదు. పైగా ప్రతీ నెలా అప్పుల మీదే బండిని నెట్టుకురావాల్సి వస్తోంది. దీంతో ఈ సంక్షేమాన్ని ఎన్నాళ్లపాటు
కొనసాగించగలరా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

సంక్షేమం కొనసాగించినన్నాళ్లు ప్రజల నుంచి సపోర్ట్ లభించడం పెద్ద కష్టం కాదు. కానీ ఆ చక్రం ఒకసారి తిరగడం ఆగితే సమస్యలు తప్పవు. అందుకే అలాంటి సమస్య తప్పదు అని భావించినప్పుడు వైసీపీ ముందస్తుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. అలాంటప్పుడు 175కు 175 గెలవడం సాధ్యమేనా? మొత్తానికి నిలిస్తేనే గెలుస్తామని వైసీపీకి బోధపడింది. అందుకే మంత్రులు, రీజనల్
కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఉన్న విషయాన్ని పరోక్షంగా జగన్ చెప్పారంటున్నారు విశ్లేషకులు. అందుకే మరో లక్ష కోట్లను పంచేసి.. ప్రజల మనసులు గెలిచి.. దానిని ఓట్లుగా మలిచి.. మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది అంటున్నారు.