ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఒక్కోసారి, ఆ పార్టీ వర్గాలకే అంతుబట్టవు. అసలు మ్యాటర్ ఏంటంటే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి, ఆతర్వాత టీడీపీలో చేరారు. ఇక గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ఆనం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆయనకు పార్టీలో సరైన గౌరవం దక్కడంలేదని ఆనం భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఇటీవల సొంత పార్టీపై నిరసన గళం వినిపించడ మొదలు పెట్టారు ఆనం రామనారాయణ రెడ్డి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా స్థానికంగా అధికారులు సరిగ్గా పని చేయడంలేదనీ, జిల్లా మంత్రుల పని తీరు బాగలేదనీ ఆనం విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక రాష్ట్రంలోని కొత్త జిల్లాల అంశం తెరపైకొచ్చేసరికి, మరింత చెలరేగిపోయిన ఆనం రామనారయణ రెడ్డి సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు ఏమయ్యిందోగానీ, రాత్రికి రాత్రే సీన్ మొత్తం మారిపోయింది.
ఏపీలోని జిల్లాల విభజన విషయమై ఆనం రామనారాయణరెడ్డి అభ్యంతరాల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిగణనలోకి తీసుకున్నారని వైసీపీ వర్గాల నుంచి టాక్ బయటకు వచ్చింది. ఆ విషయం మాత్రమే కాకుంగా, ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ కొత్త కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే తాజా మ్యాటర్ ఏంటంటే జగన్ నయా మంత్రి వర్గంలో ఆనం రామనారాయణరెడ్డికి క్యాబినెట్ బెర్త్ ఖరారయ్యిందని సమాచారం.
ఈ విషయమే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా అయితే తనకు వ్యతిరేకంగా కానీ, పార్టీకి వ్యతిరేకంగా కానీ ఎవరైనా వ్యవహరిస్తే, వారిపై ఉక్కుపాదం మోపుతారు సీఎం జగన్. అయితే ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యిందని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డిని జగన్ బుజ్జగించారని, దీంతో వైసీపీ అధిష్టానంపై ఆనం నిరసన గళాన్ని పక్కన పెట్టారని, దీంతో కొంత కాలంగా నెల్లూరు జిల్లా వైసీపీ వర్గాల్లో నెలకొన్న గందరగోళం చల్లారినట్టే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఆనం విషయంలో సీఎం జగన్ తగ్గడానికి కారణమేంటి అనేది మాత్రం మిస్టరీగా ఉందని వైసీపీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.