Jagan Davos: జగన్ దావోస్ పర్యటన సక్సెస్.. ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు..!!

ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా దావోస్ కు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ రూ. లక్షా 25వేల కోట్ల పెట్టుబడులకు ఎంపీవోయూలు చేసుకున్నారు.

  • Written By:
  • Publish Date - May 27, 2022 / 11:28 PM IST

ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా దావోస్ కు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ రూ. లక్షా 25వేల కోట్ల పెట్టుబడులకు ఎంపీవోయూలు చేసుకున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం దావోస్ వేదికగా చక్కటి ఫలితాలను రాబట్టిందని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగోతరం పారశ్రామికీకరణకు ప్రధాన కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చాలన్న లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన రూ. 1.25లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్ కో, అరబిందోలతో ఏపీ ఒప్పందం చేసుకుంది. పంప్డ్ స్టోరేజీలాంటి వినూత్న విధానాలతో మొత్తంగా 27,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంలోకి రాబోతుందని సర్కార్ తెలిపింది.

కాగా గ్రీన్ కోతో కలిసి తాము ప్రపంచంలోనే మొదటిసారిగా గ్రీన్ ఎనర్జీపై ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆర్సిలర్ మిట్టల్ ప్రకటించింది. ఈ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపింది. స్టీల్ తోపాటు, ఎనర్జీ, నిర్మాణ, మైనింగ్, రవాణా, ప్యాకేజింగ్ వంటి రంగాల్లో ఉన్న 7 ఆర్సిలర్ మిట్టల్ గ్రూపు మొదటిసారిగా ఎనర్జీకి వేదికగా రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంది. కొత్తతరం ఇంధనాలు హైడ్రోజన్, ఆమ్మోనియా ఉత్పత్తులపైనా దావోస్ లో సీఎం ప్రత్యేక ద్రుష్టిసారించారు.

గ్రీన్ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తుల దిశగా మచిలీపట్నంలో ఒక SEZను తీసుకురానుండడం దావోస్ ఫలితాల్లో ఒకటని సర్కార్ వెల్లడించింది. దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటుగా…అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈ జోన్ను డెవలప్ చేస్తారు.

కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ సమతుల్యతకు, నాణ్యతకు అగ్రస్థానం కల్పించడం, గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడం, టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ప్రపంచస్థాయి ఉత్పత్తులు సాధించేలా పరిశ్రమలకు తోడుగా నిలిచేందుకు అడ్వాన్సడ్ మాన్యుఫ్యాక్చరింగ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దావోస్‌లో అడుగులు వేసింది. WEFతో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. WEF నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి WEF తగిన సహకారాన్ని అందిస్తుంది.

దస్సాల్ట్‌ సిస్టమ్స్, మిట్సుయి ఓఎస్‌కే లైన్స్‌తోనూ జరిగిన చర్చల్లో లాజిస్టిక్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని.. పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని బైజూస్‌ ప్రకటించింది. పాఠ్యప్రణాళికను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అందిస్తామని జగన్ తో జరిగిన సమావేశంలో సంస్థ సీఈఓ రవీంద్రన్‌ వెల్లడించారు. సమగ్ర భూ సర్వే రికార్డులను నిక్షిప్తం చేయడంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ వెల్లడించింది. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం, కార్యనిర్వాహక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకున్న విశాఖపట్నానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ దావోస్‌ వేదికగా విశేషంగా కృషిచేశారు.