Jagan and Modi Tour: మోడీ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌నే మోనార్క్!

కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ సీఎం జ‌గ‌న్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, మ‌న్య‌వీరుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా తెలిసిపోయింది.

  • Written By:
  • Publish Date - July 4, 2022 / 02:32 PM IST

కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ సీఎం జ‌గ‌న్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, మ‌న్య‌వీరుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా తెలిసిపోయింది. ఇంత‌కాలం ఆయ‌న ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్ర‌నేత‌ల‌ కాళ్లువేళ్లూ ప‌ట్టుకుంటున్నాడ‌ని సోష‌ల్ మీడియా వేదికగా ప్ర‌త్య‌ర్థులు చేసిన ప్ర‌చారానికి ప్ర‌తిగా బ‌ల‌మైన సంకేతం వెళ్లింది. ఆద్యంత‌మూ సీఎం జ‌గ‌న్ కు ఇచ్చిన ప్రాధాన్యం ప్ర‌ధాని మోడీ భీమ‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లో తేట‌తెల్లమైంది. అంతా ఆయ‌న చెప్పిన‌ట్టే `అల్లూరి` విగ్ర‌హావిష్క‌ర‌ణ ప్రొటోకాల్ న‌డిచింది. ఆ మేర‌కు ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం న‌డుచుకుంది.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, బీజేపీ భాగ‌స్వామి ప‌వ‌న్, వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజుల‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ దూరంగా ఉంచారు. స్థానిక ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు అస‌లు ఆహ్వానం లేదు. చంద్ర‌బాబును అవ‌మానిస్తూ ఆహ్వానం పంపుతూ ప్ర‌తినిధిని పంపాల‌ని కోరారు. ఇక ప‌వ‌న్ కు ఆహ్వానం ఉందో లేదో కూడా తెలియ‌ని విధంగా చివ‌రి నిమిషం వ‌ర‌కు బీజేపీ సందిగ్ధంలో ప‌డేసింది. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఫోన్ కాల్ ద్వారా ఆయ‌న‌కు ఆహ్వానం ప‌లుకుతూ ప్ర‌తినిధిని పంపాల‌ని కోరార‌ట‌. అంటే, చంద్ర‌బాబు, ప‌వ‌న్ ల‌ను ప‌రోక్షంగా హాజ‌రు కావాల్సిన అవ‌స‌రంలేద‌ని చెబుతూ ఎవ‌రో ఒక‌ర్ని పంపాల‌నుకుంటే ప్ర‌తినిధుల‌ను పంప‌మ‌ని సంకేతం ఇవ్వ‌డం ఆ పార్టీల‌కు అవ‌మాన‌మే. ఇటీవ‌ల బాగా జ‌గ‌న్ కు ద‌గ్గ‌రైన మెగాస్టార్ చిరంజీవిని మాత్రం గౌర‌వంగా ఆహ్వానించారు. అంతేకాదు, మోడీ పాల్గొన్న వేదిక‌పై ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

విపక్ష నేతల్ని కాకుండా వారి పార్టీల నుంచి ప్రతినిధుల్ని మాత్రమే ఆహ్వానించేలా సీఎం జ‌గ‌న్ వేసిన ప్లాన్ ను పీఎంవో ఆఫీస్ అనుస‌రించింది. పంటికింద రాయిలా మారిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పెట్టుకున్న అదనపు భద్రత వినతిని పట్టించుకోకుండా పక్కన ప‌డేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి జగన్ సొంత రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాని మోడీ టూర్ లో ఎవరెవరుండాలనే దాన్ని నిర్దేశించే స్ధాయికి ఎదగడం మామూలు విషయం మాత్రం కాదనే చెప్పవచ్చు.

ప్ర‌తిష్టాత్మ‌కంగా భీమ‌వ‌రం స‌మీపంలోని పెదమీరం వ‌ద్ద చేసిన మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ భ‌విష్య‌త్ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు సంకేతం ఇచ్చింది. జ‌న‌సేన పార్టీని ఇంత‌కంటే పెద్ద అవ‌మానం ఏమీ ఉండ‌దు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంట‌రి పోరుకు ఆయ‌న సిద్ధం కావాల్సిందే. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ కూడా ఇటీవ‌ల జ‌న‌సేన‌కు దూరంగా జ‌రుగుతోంది. ఒంగోలు మ‌హానాడు సూపర్ హిట్ త‌రువాత ఒంటిరిగా పోటీ చేయ‌డానికి మొగ్గుచూపుతోంది. అందుకే, ఇప్ప‌టి వ‌ర‌కు ఖాళీగా ఉన్న 30 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జిల‌ను నియ‌మించుకునే క‌స‌ర‌త్తు చేస్తోది. మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో నాలుగు ర‌కాలుగా పొత్తుపై మాట్లాడిన ప‌వ‌న్ ను న‌మ్ముకోవ‌డం కంటే ఒంట‌రి పోరు బెట‌ర్ అనే ఒపీయ‌న్ కు టీడీపీ వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

మ‌న్యంవీరును విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా కేంద్రంలోని బీజేపీ వ్య‌వ‌హ‌రించిన తీరు ఏపీ విప‌క్షాల‌ను ఏకం చేస్తుందా? ఎవ‌రికివారే య‌మునా తీరు అనేలా ? చేస్తుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది. రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌ధాని మోడీ విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా చేసిన ప్ర‌సంగం సాగింది. మ‌న్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. పింగళి వెంకయ్య, కందుకూరి వీరేశలింగం, ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి మహోన్నతులు పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.

అల్లూరి రంప పోరాటానికి వందేళ్లు పూర్తయ్యాయని మోదీ చెప్పారు. అల్లూరి నడిచిన నేలపై మనం నడవడం సంతోషకరమని అన్నారు. వందేమాతరం నినాదం, ‘మనదే రాజ్యం’ నినాదం ఒకే లాంటివని చెప్పారు. అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అల్లూరికి చెందిన మోగల్లులోని ధ్యానమందిరం, చింతపల్లి పీఎస్ ను అభివృద్ధి చేస్తామని మోదీ వెల్ల‌డించారు. లంబసింగిలో అల్లూరి మెమోరియల్, గిరిజన మ్యూజియంను నిర్మిస్తామని ప్ర‌క‌టించారు. మన్యం వీరుడిగా అల్లూరి ఆంగ్లేయులతో వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. మనమంతా ఒక్కటే అనే భావనతో ఉద్యమం జరిగిందని అన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలని పిలుపునిచ్చారు. ఏడాది పాటు అల్లూరి జయంతి, రంప పోరాటం ఉత్సవాలను నిర్వహిస్తామని మోదీ ప్ర‌క‌టించారు. మొత్తం మీద జ‌గ‌న్ మార్క్ పాలిటిక్స్ కు విగ్ర‌హావిష్క‌ర‌ణ వేదిక అయింది.