Land Registrations : జ‌గ‌న్ విప్ల‌వాత్మ‌క పాల‌నా సంస్క‌ర‌ణ‌- గ్రామ స‌చివాల‌యాల్లో రిజిస్ట్రేష‌న్లు

గ్రామ , వార్డు స‌చివాల‌యాల్లోనే అక్టోబ‌ర్ 2వ తేదీ నుంచి రిజిస్టేష‌న్లు జ‌రిగేలా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

  • Written By:
  • Updated On - June 12, 2022 / 10:05 AM IST

గ్రామ , వార్డు స‌చివాల‌యాల్లోనే అక్టోబ‌ర్ 2వ తేదీ నుంచి రిజిస్టేష‌న్లు జ‌రిగేలా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేర‌కు హుటాహుటిన అధికారులు ఏర్పాట్ల‌ను ముమ్మ‌రం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న `జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పత్రం` పంపిణీ ని ప్రారంభించ‌డానికి స‌ర్కార్ సిద్ధం అయింది. ఏపీలోని 650కి పైగా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలకు శ్రీకారం చుట్టనున్నారు.

స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా , మైనింగ్ ద్వారా ఖజానాకు ఆదాయాన్ని పెంచాల‌ని అధికారుల‌కు జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. ఓటీఎస్, టిడ్కో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తున్న రిజిస్ట్రేషన్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియతో వచ్చే చట్టపరమైన హక్కులు, భద్రతపై ప్రజలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద శాశ్వత భూమి పట్టాలు అందించడంతో పాటు ఎంపిక చేసిన సచివాలయాల్లో అక్టోబర్ 2లోగా సర్వీసుల నమోదుకు చర్యలు తీసుకోవాల‌ని టార్గెట్ పెట్టారు. 14,000 మందికి పైగా గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించడానికి శిక్షణ పొందుతున్నారు. 650 గ్రామాల్లో సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.