YCP Rajyasabha : వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు ఖ‌రారు

రాజ్య‌స‌భ అభ్య‌ర్థిత్వాల‌ను వైసీపీ ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య‌కు రాజ్య‌స‌భ ప‌ద‌విని జ‌గ‌న్ ఖ‌రారు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

  • Written By:
  • Updated On - May 18, 2022 / 09:39 AM IST

రాజ్య‌స‌భ అభ్య‌ర్థిత్వాల‌ను వైసీపీ ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య‌కు రాజ్య‌స‌భ ప‌ద‌విని జ‌గ‌న్ ఖ‌రారు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రో బీసీ నేత బీద మ‌స్తాన్ రావును రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రోసారి రాజ్య‌స‌భ అవ‌కాశాన్ని ఇస్తూ విజ‌య‌సాయిరెడ్డిని కొన‌సాగించారు. సీఎం జ‌గ‌న్ కు న్యాయ‌ప‌రంగా ఢిల్లీ వేదిక‌గా స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తోన్న నిరంజ‌న్ రెడ్డిని రాజ్య‌స‌భ నాలుగో అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం.

తొలి నుంచి ఆదానీ గ్రూప్ కు రాజ్య‌స‌భ వైసీపీ కోటా నుంచి ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, చివ‌రి నిమిషంలో మారిన ఈక్వేష‌న్ల దృష్ట్యా ఆదానీ గ్రూప్ వెన‌క్కు త‌గ్గింది. పైగా వైసీపీ కోటా నుంచి గ‌త రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో రిల‌యెన్స్ గ్రూప్ కు ఇవ్వ‌డం పార్టీకి న‌ష్టం చేకూర్చే అంశం. అయిన‌ప్ప‌టికీ బీజేపీ అగ్ర‌నేత‌ల ప్రోద్భ‌లంతో ఇవాల్సిన ప‌రిస్థితి ఇచ్చింది. అప్ప‌ట్లో ప‌రిమ‌ళ‌న‌త్వానీ ఎంపిక ఒక చ‌ర్చ‌కు దారితీసింది. అదే త‌ర‌హాలో ఈసారి కూడా ఆదానీ గ్రూప్ కు వైసీపీ ఒక సీటును కేటాయించాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆ విధంగా జ‌ర‌గ‌లేదు. అయితే, బీజేపీ అగ్ర‌నేత‌ల ఒత్తిడి కార‌ణంగా నిరంజ‌న్ రెడ్డికి రాజ్య‌స‌భ‌ను ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాల‌యానికి స‌న్నిహితంగా నిరంజన్ రెడ్డి ఉంటారు. సీఎం జ‌గ‌న్ కు ఢిల్లీ కేంద్రంగా అపాయిట్మెంట్ లు ఇప్పించ‌డంలో ప‌లు సంద‌ర్భాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని స‌మాచారం. తొలి రోజుల్లో జ‌గ‌న్ కు అమిత్ షా అపాయిట్మెంట్ ల‌భించలేదు. ఆ స‌మ‌యంలో నిరంజ‌న్ రెడ్డి లైజ‌నింగ్ ఫ‌లించింద‌ని ఢిల్లీ వ‌ర్గాల టాక్‌. అందుకే, గిఫ్ట్ గా రాజ్య‌స‌భ‌కు వైసీపీ కోటా నుంచి ఆయ‌న్ను ఎంపిక చేసిన‌ట్టు ప్రాథ‌మికంగా తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు బీసీల‌పై వైసీపీ తొలి నుంచి ప్లాన్ చేస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో బీసీల అండ‌తోనే 151 స్థానాల‌ను గెలుచుకున్న‌ట్టు ఆ పార్టీ నిర్థార‌ణ‌కు వ‌చ్చింది. అందుకే, బీసీల‌కు ఐకాన్ గా ఉన్న ఆర్ కృష్ణ‌య్య‌కు రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్రాంతాల‌కు అతీతంగా కృష్ణ‌య్య‌ను బీసీ ఐకాన్ గా ఆ వ‌ర్గం చూస్తోంది. పైగా 2019 ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ జ‌గ‌న్ కు అండ‌గా కృష్ణ‌య్య నిలిచారు. వాస్త‌వంగా 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ టీడీపీ బాధ్య‌త‌ల‌ను కృష్ణ‌య్య స్వీక‌రించారు.కానీ, ఆయ‌న తెలంగాణ‌లో పార్టీని నిల‌బెట్ట‌లేక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ, జ‌గన్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర స‌మ‌యంలో ఆయ‌న‌కు అండ‌గా నిలుస్తూ బీసీల‌ను వైసీపీకి ద‌గ్గ‌ర చేశార‌ని వైసీపీ విశ్వ‌సించింది. అందుకే, రాజ్య‌స‌భ‌కు ఆయ‌న్ను ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. ఇక బీద మ‌స్తాన్ రావు బీసీ వ‌ర్గానికి చెందిన టీడీపీ మాజీ లీడ‌ర్‌. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు. ఆ రోజున జ‌గ‌న్ ఇచ్చిన ప్రామిస్ ప్ర‌కారం రాజ్య‌స‌భ‌ను క‌ట్ట‌బెట్టార‌ని తెలుస్తోంది.

వైసీపీ కోటాలో మైహోం రామేశ్వ‌ర‌రావు , ఆదానీ గ్రూప్‌, మాజీ కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణి త‌దిత‌రుల పేర్లు వినిపించాయి. కానీ, సామాజిక ఈక్వేషన్, ఢిల్లీ పెత్త‌నం విధేయ‌త వెర‌సి విజ‌య‌సాయిరెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, బీద మ‌స్తాన్ రావు, ఆర్ కృష్ణ‌య్య పేర్ల‌ను వైసీపీ ఖ‌రారు చేసింది.