Site icon HashtagU Telugu

CM Chandrababu: సీఎం చంద్రబాబు కొత్త నినాదం.. ‘బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్’!

Cbn In Hindustan Times Leadership Summit

Cbn In Hindustan Times Leadership Summit

CM Chandrababu: దేశరాజధాని ఢిల్లీ లో జరుగుతున్న హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, టెలీకాం రంగంలో డీరెగ్యులేషన్ అమలు వల్ల పురోగతి సాధించామనీ, దానిని అమలు చేయడం వలన టెలీకాం రంగం బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు.

అదే సమయంలో, సోషల్ మీడియాలో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. “వాట్సాప్ గవర్నెన్స్” అనే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని, ఇది దేశంలోనే తొలిసారిగా అమలు చేయబడుతున్నదని ఆయన చెప్పారు. ఈ విధానం ద్వారా ప్రజా సేవలను చివరి వ్యక్తి వరకు అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ యుగంలో సమాచారమే ఒక పెద్ద నిధి అని పేర్కొంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ టెక్నాలజీలను ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. “ఒక స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే, ప్రపంచంలో ఎక్కడున్నా మన పనులను నిర్వహించుకోవచ్చు,” అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ఇప్పుడు ఆ నియమాలు అమలు చేయాలేమో:

దక్షిణాది జనాభా సమస్యపై మాట్లాడిన సీఎం చంద్రబాబు, ‘‘గతంలో నేను ‘బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌట్ ఎయిడ్స్’ అనే నినాదం ఇచ్చాను. ఇప్పుడు ‘బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్’ అని పిలుపునిస్తున్నాను. ప్రస్తుతం చైనా, జపాన్ సహా అనేక దేశాల్లో వయోధికుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ సమస్య ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైంది. ఇక్కడ ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతోంది. సాధారణంగా ఈ రేటు 2.1 కంటే ఎక్కువగా ఉంటే ఏవిధమైన సమస్యలు ఉండవు, కానీ ఇప్పుడు ఇది బోర్డర్ లైన్‌కి చేరుకుంది. రేటు కాస్త తగ్గితే, జపాన్, చైనా మాదిరి సమస్యలు మన దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంది’’ అన్నారు.

తర్వాత, భారతదేశం యొక్క 145 కోట్ల జనాభా గురించి పేర్కొంటూ, ‘‘పాపులేషన్ మేనేజ్మెంట్‌ను సరిగ్గా చేస్తే, మనం ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గే సామర్థ్యం కలిగిన దేశంగా మారతాం. మనం ప్లాన్ చేస్తే, 30-40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో పనిచేసి, భారతదేశానికి ఆదాయం తెచ్చిపెడతారు. బ్రిటిష్‌ వాళ్లు ఎలాగైతే భారత్‌కి వచ్చి పరిపాలించారో, మనం కూడా అలాంటి విధంగా ప్రపంచ దేశాలను ప్రభావితం చేయవచ్చు’’ అన్నారు.

అంతేకాక, గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే నిబంధనపై మాట్లాడుతూ, ‘‘ఒకప్పుడు ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదని నిబంధనలు పెట్టాను. కానీ ఇప్పుడు ఆ నిబంధనను తొలగించాను. ఇకపై కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత ఉంటుందని అందుకు కొత్త నిబంధన పెట్టాలి’’ అంటూ నవ్వుతూ చెప్పారు.

ఎన్డీయే కూటమి గురించి మాట్లాడుతూ:

పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధి తప్పనిసరిగా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 1వ తరగతి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. నీటి భద్రతపై కూడా ఆయన దృష్టి పెట్టి, “భవిష్యత్తులో నీటికి భద్రత సృష్టించుకోవాలి” అని అన్నారు.

దేశ రాజకీయాలపై మాట్లాడుతూ, ‘‘బీజేపీకి వాజ్‌పేయి పునాదులు వేస్తే, నరేంద్రమోడి బలోపేతం చేశారన్నారు. మోడీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారవుతుందని చెప్పారు. “రానున్న కాలంలో భారతదేశం ప్రపంచంలో రెండవ లేదా మూడవ స్థానంలో నిలుస్తుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక, ‘‘నరేంద్రమోడి మా లీడర్, ఆయన ఆధ్వర్యంలో ముందుకు వెళ్తాం’’ అని స్పష్టం చేశారు. హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి సీఎం ల సమావేశం జరిగిందని, అందులో 2029 ఎన్నికలకు సంబంధించి అందరి ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్నారని చెప్పారు. ‘‘ఏపీలో కూడా 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాం’’ అని తెలిపారు.

అంతేకాక, ‘‘గత ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి వచ్చాయి. పవన్ కళ్యాణ్ మూడు పార్టీలను కలిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని మేము ముందుగానే ఊహించాము’’ అని చెప్పారు.

జాతీయ స్థాయిలో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని అభిప్రాయపడ్డారు. “కూటమిలో ఎటువంటి సమస్యలు లేవు, అందరం కలసి ముందుకు సాగుతాం. మా కూటమి దీర్ఘకాలం కొనసాగుతుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోని విపరీత ధోరణులను విమర్శిస్తూ, ‘‘వ్యక్తిత్వ హసనం జరుగుతోంది, మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.