CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి నెలా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం శుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారాలంటే ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా రూపుదిద్దుకోవాలని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఏపీకి ఐదు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడం గర్వకారణమని అన్నారు. తిరుపతిలో నిర్వహించిన ప్రజా వేదికలో మాట్లాడుతూ, తాను తిరుపతిలో చదువుకుంటూ ఎమ్మెల్యేగా ఎదిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి నాలుగోసారి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నానని పేర్కొన్నారు.
రాజకీయాలు కలుషితమైపోయాయని ఆయన అన్నారు. నేరచరిత్ర ఉన్న వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని, ఇంట్లో చెత్తను శుభ్రం చేసినట్టే.. నేర రాజకీయాలు చేసేవారిని క్లీన్ చేయాలన్నారు సీఎం చంద్రబాబు. నేర రాజకీయాలు చేసేవారు మనకు అవసరమా.? అని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమలో ముఠా కక్షలను రూపుమాపామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. హింసా రాజకీయాలు చేసేవారి గుండెల్లో నిద్రపోతా అని సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ బంగారుపాళ్యం పర్యటనలో పులివెందుల రాజకీయం చేశారు అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రోడ్డుపై మామిడికాయలు పారబోసి రాజకీయం చేశారని ఆయన ధ్వజమెత్తారు. రౌడీల గుండెల్లో నిద్రపోయి.. తిరుపతిని కాపాడా అని ఆయన అన్నారు. గత ఐదేళ్లు స్వేచ్ఛ అన్నదే లేదని, సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి నిలబెట్టుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. రాయలసీమకు నీళ్లు తెచ్చిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు.
పెన్షన్ నాలుగు వేలు ఇచ్చామని, తల్లికి వందనం కిందా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చామన్నారు. దీపం ద్వారా సిలెండర్ ఇచ్చామని ఆయన వెల్లడించారు. మానవత్వం ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అని, మాటలు చెప్పే పార్టీ వైసీపీ అని ఆయన అన్నారు.
Health Tips: షాకింగ్ రిపోర్ట్.. వ్యాయామానికి కూడా వ్యక్తిత్వం అవసరమా?