Swarnandhra Vision 2047: విజయవాడ నగరం స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి వేదిక అయింది. శుక్రవారం, ఇందిరా గాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్ మరియు మంత్రులు, ముఖ్య అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది పెద్దఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర @ 2047 పేరుతో ఏర్పాటు చేసిన స్టాల్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరియు ఇతర మంత్రులు సందర్శించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు.
స్వర్ణాంధ్ర 2047 సాకారానికి పది సూత్రాలు..
పేదరికంలేని, సమృద్ధికరమైన అవకాశాలు కలిగిన, అద్భుత ఆవిష్కరణలు మరియు వినూత్న ఆలోచనలకు నైపుణ్యాలపై ఆధారపడి ఉండే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అవతరించేలా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రూపొందించిన పది సూత్రాలు మార్గదర్శకంగా ఉన్నాయ్. ఈ సూత్రాలు, పేదరికాన్ని తొలగించడం, ప్రతి కుటుంబానికి అవసరమైన వనరులు సమకూర్చడం, అలాగే ఎదిగేందుకు అవకాశాలను కల్పించడం వంటి లక్ష్యాలను సాధించేందుకు రూపోందించబడ్డాయి.
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా, ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపే ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఈ విజయ లక్ష్యంగా, ప్రజల ఆరోగ్యం, సంపద, సంతోషం మరియు సుఖసమృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకోబడ్డాయి.
ఈ విజన్‌లోని 10 ముఖ్య అంశాలు:
- ఉద్యోగం మరియు ఉపాధి కల్పన: ప్రజల ఆర్థిక భద్రత కోసం పథకాలు.
- రైతుల ఆదాయ పెరుగుదల: వ్యవసాయ రంగానికి మద్దతు మరియు నూతన సాంకేతికతలు.
- మహిళల ఆర్థికాభివృద్ధి: మహిళల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడం.
- పేదరిక నిర్మూలన: సమాజంలో అన్ని వర్గాలకు మంచి జీవన ప్రమాణాలు.
- మానవ వనరుల అభివృద్ధి: నైపుణ్యాల పెంపు, విద్య, ప్రగతిశీలమైన శిక్షణ.
- ఇంటింటికీ నీటి భద్రత: జలవనరుల సముచిత నిర్వహణ.
- రైతు-వ్యవసాయ సాంకేతికత: వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతలు.
- ప్రపంచస్థాయి లాజిస్టిక్స్: అద్భుతమైన పంపిణీ వ్యవస్థ.
- శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ: వినియోగంలో సమర్థత.
- స్వచ్ఛాంధ్ర, సమగ్ర సాంకేతికత: అన్ని దశలలో సమగ్రమైన పరిష్కారాలు.
స్వచ్ఛాంధ్ర స్టాల్ వద్ద సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
స్వచ్ఛాంధ్ర స్టాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఉత్సాహంగా స్వచ్ఛాంధ్ర యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేశారు. “స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలని” అన్నారు. విద్యార్థులతో ఆయన పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారనే విషయంపై ముచ్చటిస్తూ, విద్యాసంస్థలలో ఉన్న అవగాహనను పెంచేందుకు మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి మహిళా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, మహిళా రైతులకు ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వ నుంచి అందిస్తున్న సహాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌ను 10 సూత్రాలతో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆక్వా ఉత్పత్తుల రవాణా విషయంలో ఇబ్బందులను పరిష్కరించమని ఆక్వా రైతులు కోరారు.
మహిళా ఆర్థికాభివృద్ధి అవకాశాలపై, డ్వాక్రా మహిళ సుహాసిని స్పందిస్తూ, “మహిళల ఆర్థికాభివృద్ధికి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాం” అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలవాలని తమ ఆశాభావాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, స్వర్ణాంధ్ర 2047 విజన్ పై ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.