Site icon HashtagU Telugu

CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచానికి చాటడం లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu), మంత్రి నారా లోకేష్ కీలక విదేశీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) జరగనున్న నేపథ్యంలో ఈ పర్యటనలకు ప్రాధాన్యత ఏర్పడింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 2 నుండి 5వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. విశాఖలో జరగనున్న సీఐఐ సమ్మిట్‌లో భాగంగా ఆయన లండన్‌లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన పలువురు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, అనుకూల పరిస్థితులను వివరించి, విశాఖ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ఆయన వారిని ఆహ్వానించనున్నారు.

Also Read: ‎Bread Omelette: ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!

మరోవైపు ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ ఈ నెలలోనే కీలక పర్యటనకు బయలుదేరుతున్నారు. ఆయన అక్టోబర్ 19 నుండి 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల్లో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం చేస్తారు. విద్యారంగంలో నూతన విధానాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఆయన ఈ అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటు మంత్రి నారా లోకేష్ సీఐఐ భాగస్వామ్య సమ్మిట్ విజయవంతం కోసం ఆస్ట్రేలియాలో రోడ్ షోలకు కూడా హాజరుకానున్నారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక దిగ్గజాలను, వాణిజ్యవేత్తలను ఆహ్వానించేందుకు ఆయన ఈ అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకుంటారు. ముఖ్యమంత్రి, మంత్రి చేపడుతున్న ఈ విదేశీ పర్యటనలు విశాఖపట్నంలో జరగబోయే అంతర్జాతీయ సదస్సుకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది.

Exit mobile version