అమరావతి, ఆంధ్రప్రదేశ్ : (Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి సమయానికి రాకుండా, కొద్దిసేపు మాత్రమే ఉన్న తర్వాత బయటకి వెళ్లిపోతున్న తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన సమయంలో సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఈ విషయాన్ని గమనించిన సీఎం చంద్రబాబు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును ప్రశ్నించి, వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో విప్‌లు వెంటనే మరికొంత మంది ఎమ్మెల్యేలకు కాల్ చేసి, అసెంబ్లీకి హాజరు కావాలని ఆదేశించారు.
ఇంకా హాజరు కాలేకపోయిన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి కారణాలు అడిగారు. ప్రజల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, పాలనపై చర్చించేందుకు అసెంబ్లీ వేదిక అని భావించే చంద్రబాబు, స్వయంగా ప్రతిరోజూ హాజరవుతారు. అదే విధంగా ఆయన ఇతర పార్టీల నేతలకూ హాజరయ్యేలా సూచనలు చేస్తున్నారు.
ఎమ్మెల్యేలు ఇలా అసెంబ్లీ సమావేశాలను నిర్లక్ష్యం చేయడాన్ని సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారు. సెప్టెంబర్ 18 నుంచి మొదలైన వర్షాకాల సమావేశాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయన హాజరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.