Site icon HashtagU Telugu

2004 , 2014 Elections : ఓటమికి కారణం నేనే – చంద్రబాబు

Cbn 2004 2014

Cbn 2004 2014

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) తాజాగా అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఎదుర్కొన్న ఓటమికి తానే కారణమని స్పష్టం చేశారు. పరిపాలనపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల పార్టీని పట్టించుకోలేకపోయానని, ఆ కారణంగానే టీడీపీ ఎన్నికల్లో వెనుకబడ్డట్లు అన్నారు. కొన్ని ముఖ్యమైన పనులు చేయలేకపోయిన బాధ తనలో ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ప్రజలు మళ్లీ మద్దతు ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించగా, 2004లో మాత్రం ప్రజల మద్దతు దూరమైంది. ఎన్టీఆర్ నేతృత్వంలో 1994లో టీడీపీ గెలిచినప్పటికీ, పార్టీ అంతర్గత విభేదాలతో చివరకు చంద్రబాబు అధినేతగా మారారు. ఆయన పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు పురోగమించడంతో 1999లో ప్రజలు మళ్లీ ఆయనకు అధికారం అందజేశారు. అయితే 2004 నాటికి అభివృద్ధి సమగ్రంగా జరగడం లేదన్న విమర్శలతో పాటు, అధికార వ్యతిరేకత పెరిగిన కారణంగా టీడీపీ ఓటమి పాలైంది.

ఆ తర్వాత రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమం వంటి అంశాలు రాజకీయ సమీకరణాలను మార్చేశాయి. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి గాడిన పెట్టేందుకు చంద్రబాబు ప్రజల మద్దతును పొందారు. అయితే పాలనపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం వల్ల పార్టీపై నెగ్లిజెన్స్ పెరిగి, 2019లో ఊహించని పరాజయం ఎదురైంది. 2024 ఎన్నికల్లో జనసేన, బిజెపి తో పొత్తు ఏర్పరచుకొని అఖండ విజయం అందుకున్నారు.