White Paper on Amaravati : ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం

అమరావతిలో భవనాలు, నిర్మాణ సామగ్రి పాడయ్యాయని అన్నారు. జగన్‌పై నమ్మకం లేక పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని, అమరావతి నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని తెలిపారు

  • Written By:
  • Publish Date - July 3, 2024 / 04:35 PM IST

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu ఏపీ సచివాలయంలో రాజధాని అమరావతి (Amaravati )పై సీఎం శ్వేతపత్రం (White Paper) విడుదల చేసారు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిని సందర్శించిన బాబు..అక్కడి పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్‌ను ఏపీ అని పిలుస్తారని… దీనిలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకూ అంత ప్రాధాన్యం ఉందన్నారు. జగన్‌ మూర్ఖత్వం వల్ల ఈ రెండు ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయని ధ్వజమెత్తారు. పోలవరం, అమరావతి.. సంపద సృష్టి కేంద్రాలని, వాటివల్ల మొత్తం సమాజానికే మేలు జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా ఉండాల్సిన ఐదేళ్లపాటు అమరావతిలో జగన్‌ చేసిన విధ్వంసంపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. అమరావతిలో ఎంత నష్టం జరిగింది? నిర్మాణాలు ఎంతవరకు పనికొస్తాయి? అనే దానిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపిన సీఎం..ఈరోజు చెప్పినట్లే సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు సిటీలుంటే.. మూడో సిటీ సైబరాబాద్ ను అభివృద్ధి జరిగింది తన హయాంలోనేనని పేర్కొన్నారు. హైదరాబాద్ కు నీళ్లు, కరెంట్ లేని రోజుల నుంచి.. అభివృద్ధి చేశామని , హైదరాబాద్ కు నీళ్లకోసం కృష్ణాజలాలను తీసుకొచ్చి చరిత్ర తిరగరాశామని గుర్తు చేసారు. అలాంటి అనుభవంతోనే అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఏ పక్క నుంచి చూసినా అమరావతి ప్రాంతమే మధ్యలో కనిపిస్తుందన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామన్నారు.

అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దేందుకు ల్యాండ్ పూలింగ్ ఒక్కటే మార్గంగా కనిపించిందన్నారు. గతంలో అమరావతే రాజధానిగా ఉండాలన్న జగన్.. సీఎం అవ్వగానే మూడు రాజధానులంటూ అమరావతి అభివృద్ధిని పక్కన పెట్టేశాడన్నారు. సింగపూర్ మాదిరిగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు అనేక కంపెనీలు ఫండ్స్ తో ముందుకొచ్చాయని , గుడివాడ, చిలకలూరిపేట వంటి ఊళ్లను కలిపి క్యాపిటల్ రీజన్ కు ఇచ్చారన్నారు. అన్ని గ్రామాల నుంచి మట్టి, నీరు తెచ్చి అమరావతిలో ఉంచామని గుర్తు చేశారు. దేశంలోని ప్రముఖ ఆలయాల నుంచి పవిత్ర నీరు, మట్టి తీసుకువచ్చామన్నారు. పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉందన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్ నుంచి మట్టి, యమునా నది నుంచి నీరు తీసుకువచ్చారన్నారు. అందరికీ న్యాయం జరగాలన్న లక్ష్యంతో ల్యాండ్ పూలింగ్ పూర్తి చేశామన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతని పేర్కొన్నారు. 29వేల మంది రైతులు 34,400 ఎకరాలు అమరావతి కోసం భూములిచ్చారని,తెలిపారు. రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చామని అన్నారు. జగన్‌(Jagan) అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వ అరాచక పనుల వల్ల అమరావతి ధ్వంసమైందని పేర్కొన్నారు. అమరావతిలో భవనాలు, నిర్మాణ సామగ్రి పాడయ్యాయని అన్నారు. జగన్‌పై నమ్మకం లేక పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని, అమరావతి నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని తెలిపారు. ప్రజా రాజధాని అమరావతిని నిర్మించి ఉపాధి కల్పన, సంపదను సృష్టించి, పేదరక నిర్మూలనే ధ్యేయంగా ముందుకు సాగుతామని చంద్రబాబు తెలిపారు.

Read Also : PM Modi To Meet India: రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు టీమిండియాను క‌ల‌వ‌నున్న ప్ర‌ధాని మోదీ..!