CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వైపు పరిపాలనపై దృష్టి పెడుతూనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలను బయటపడుతూ ఎండగడుతున్నారు సీఎం చంద్రబాబు. తాజాగా ఆయన మరో అవినీతిపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా సహజ వనరుల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వం అడవులను ధ్వంసం చేసిందని, సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారన్నారు. భూములు, ఖనిజాలు దోచుకున్నారని, విశాఖపట్నం , ఒంగోలు, చిత్తూరులో ఇళ్ల నిర్మాణం పేరుతో భూకబ్జాలు చేశారని ఆరోపించారు . సహజవనరుల దోపిడీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి చర్యలకు తావులేకుండా కొత్త వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. భూమి పట్టా చట్టంలో భారీగా తప్పులున్నట్లు బాబు తెలిపారు.
వైసీపీ అక్రమాలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను పరాకాష్ఠ అని అన్నారు సీఎం. ప్రజల భూములన్నీ దోచుకోవడానికి ఈ యాక్ట్ ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రజలకు తమ భూములకు హక్కు లేకుండా చేశారని దుయ్యబట్టారు. రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన భూములను అక్రమంగా నివాస స్థలాలకు కేటాయించారని అన్నారు. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం హయగ్రీవ సంస్థకు ఇచ్చిన 12.51 ఎకరాల భూమిని రెసిడెన్షియల్ డెవలప్ మెంట్ కింద మార్చి అందులో వాటా కొట్టేసే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒంగోలులో భారీ భూ అక్రమాలు జరిగాయని స్పష్టం చేశారు చంద్రబాబు. రూ.101 కోట్ల విలువ చేసే భూ అక్రమాలు జరిగాయి. కుటుంబ వివాదాలు ఉన్న భూములు, యాజమాన్య హక్కులు లేని ప్రైవేటు భూములు, బీడు భూములు, ప్రభుత్వ స్థలాలను వైసీపీ నేతలు గుర్తించి వాటిని చేజిక్కించుకునేలా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు సీఎం. అలాగే పుంగనూరులో 982 ఎకరాలను దోచుకున్నారని, వైసీపీ పార్టీ నేతలకు 13,800 ఎకరాలను ధారాదత్తం చేసిందని గత ప్రభుత్వ తీరుని ఎండగట్టారు సీఎం చంద్రబాబు.
Also Read: Black Shades : ప్రముఖుల సెక్యూరిటీ ఎప్పుడూ నల్ల కళ్లజోడును ఎందుకు ధరిస్తారో తెలుసా..?