Site icon HashtagU Telugu

Nitish Kumar Reddy : నితీష్ రెడ్డి పై సీఎం చంద్రబాబు ప్రశంసలు

Nithish Cbn

Nithish Cbn

తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి కంగారుల గడ్డపై కంగారూలను కంగారెత్తించాడు. సూపర్ సెంచరీతో టీమ్ ఇండియాను రేసులోకి తెచ్చి తెలుగోడి సత్తా ఏంటో చూపించాడు. అరంగేట్ర సిరీస్లోనే నితీశ్ సెంచరీ చేయడం విశేషం. వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం దీటుగా ఎదుర్కొంటూ అద్భుతమైన షాట్లతో అలరించారు. నితీశ్ ఇన్నింగ్సులో ఒక సిక్సర్, 10 ఫోర్లు ఉన్నాయి. ‘నితీశ్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్’ అంటూ భారత ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నితీష్ సెంచరీ పై క్రీడా అభిమానులే కాదు రాజకీయ , సినీ , బిజినెస్ రంగ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh)లు నితీష్ రెడ్డి ఆట తీరు పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇలాంటి ప్రదర్శనలతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాలని సీఎం ఆకాంక్షించారు. తన ఆటతో దేశ కీర్తి ప్రతిష్ఠలను మరింత పెంచాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)తన మొదటి సెంచరీ (100 in 171 balls) సాదించడంపై ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సీనియర్లు పెవిలియన్ చేరిన కష్ట పరిస్థితుల్లో నితీష్ నిలదొక్కుకుని సెంచరీ సాధించడం గర్వకారణం. ఇలాంటి సమయంలో నితీష్ రెడ్డి సెంచరీ కొట్టి ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా, భారత జట్టుకు కీలక మద్దతుగా నిలిచింది.

నితీష్ కుమార్ రెడ్డి‌కి ఇదే తొలి టెస్ట్ సెంచరీ. గత మూడు టెస్ట్‌ల్లో 41, 38 నాటౌట్, 42, 42, 16 పరుగులతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న నితీష్.. తాజా మ్యాచ్‌లో మాత్రం అసాధారణ బ్యాటింగ్‌తో ఏకంగా సెంచరీనే సాధించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి.. తనదైన బ్యాటింగ్‌తో 171బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కఠినమైన పిచ్‌పై మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది నితీష్ మాత్రం అలవోకగా సెంచరీ సాధించి కంగారులను ఖంగారు పెట్టించాడు. నితీష్ కుమార్ రెడ్డి శతకంతో అతని తండ్రి ముత్యాల రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. నితీష్ ఇన్నింగ్స్ చూసేందుకే వైజాగ్ నుంచి మెల్‌బోర్న్ వెళ్లిన ముత్యాల రెడ్డి.. కొడుకు సక్సెస్‌ను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

Read Also : Fake IPS Officer : పవన్ కళ్యాణ్ పర్యటనలో ఫేక్ ఐపీఎస్.. ఏపీ హోం మంత్రి సీరియస్