Site icon HashtagU Telugu

CII India : ఇండో – యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ లో చంద్రబాబు స్పీచ్ హైలైట్స్

Cm Chandrababu Participates

Cm Chandrababu Participates

ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో తీసుకుంటున్న కీలక నిర్ణయాలను వివరిస్తూ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం అద్భుతమైన సాగరతీర నగరమని, ఈ ప్రాంతంలో సహజ వనరులు, మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా గూగుల్ అమెరికా వెలుపల తన అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు సబ్‌సీ కేబుల్ లింక్ కూడా ఇక్కడి నుంచే ఏర్పాటవుతుండటంతో విశాఖ గ్లోబల్ డిజిటల్ హబ్‌గా అవతరించబోతోందని ఆయన వివరించారు. గతంలో ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రోత్సహించిన తాను ఇప్పుడు అదే మార్గంలో మరింత ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారిస్తున్నానని తెలిపారు.

Amaravati: అమరావతి అభివృద్ధికి ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

“భారత్ క్వాంటం మిషన్”లో భాగంగా దేశంలోని తొలి క్వాంటం వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్తు సాంకేతికతలో కీలకమైన డ్రోన్ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు “డ్రోన్ సిటీ”ని ఏర్పాటు చేస్తున్నామని, సివిల్ అప్లికేషన్లు, డిఫెన్స్ రంగాల్లో వీటి వినియోగం విస్తృతమవుతుందని వివరించారు. అంతేకాదు, స్పేస్ అప్లికేషన్లకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో “స్పేస్ సిటీ”ని కూడా ఏపీలో స్థాపించాలనే ప్రణాళిక ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, సౌర, పవన, పంప్డ్ హైడ్రో ప్రాజెక్టుల్లో రాష్ట్రం బలంగా ఉన్నదని చెప్పారు. భారతదేశం 500 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశగా, ఆంధ్రప్రదేశ్ 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారిస్తోందని తెలిపారు.

అలాగే “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానాన్ని అమలు చేస్తున్నామని, కేవలం 45 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని వివరించారు. గూగుల్ ప్రాజెక్టుకు కూడా రెండు మూడు రోజుల్లోనే అనుమతులు మంజూరు చేయడం ఇందుకు ఉదాహరణగా చెప్పారు. పెట్టుబడిదారులు ముందుకు వస్తే వారికి ప్రత్యేక ఎస్కార్ట్ ఆఫీసర్లను నియమించి పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆయన “గ్లోబల్ మార్కెట్‌కి గేట్‌వే”గా అభివర్ణిస్తూ, విద్య, వైద్యం, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు తదితర రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో ఆంధ్రప్రదేశ్‌కు సాటి రాష్ట్రం లేదని, యూరప్ పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. “2047 నాటికి భారత్ ప్రపంచ అగ్రదేశంగా అవతరించనుంది, ఆ మార్గంలో ముందుండేది ఆంధ్రప్రదేశ్‌ అవుతుంది” అని సీఎం చంద్రబాబు నాయుడు నమ్మకంగా పేర్కొన్నారు.

Exit mobile version