. పనితీరుపైనే పదవులు..త్రైమాసిక సమీక్ష తప్పదు
. పార్లమెంటరీ కమిటీలకు ప్రాధాన్యం..కూటమి బలోపేతమే లక్ష్యం
. వైసీపీ పాలనపై విమర్శలు..అభివృద్ధి–సంక్షేమమే ప్రాధాన్యం
CM Chandrababu : పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యమన్న భావనకు తావులేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. నాయకులు ఎవరైనా సరే పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించిన, నిర్లక్ష్యం చూపినా లేదా వివాదాలకు కారణమైతే పక్కనబెట్టేందుకు వెనుకాడబోమని తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చామనే అహంకారం వద్దని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ కమిటీల వర్క్‌షాప్‌లో పాల్గొన్న చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీలో పదవులు పొందిన ప్రతి ఒక్కరి పనితీరును మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తామని ఫలితాలు కనబడకపోతే బాధ్యతలు మార్చేస్తామని వెల్లడించారు. పార్టీ వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులకు అనుగుణంగా నేతలు, కార్యకర్తల్లోనూ ఆలోచనా ధోరణి మారాలని సూచించారు. ప్రజలిచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిదని గుర్తు చేశారు.
పాలనలో పార్లమెంటరీ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులతో సమన్వయం పెంచుకుని పనిచేయాలని సూచించారు. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో కలిసికట్టుగా ముందుకు సాగాలని కూటమి బలమే రాష్ట్రాభివృద్ధికి పునాదని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో కూటమికి వచ్చిన ఓట్లతో సంతృప్తి పడకుండా ప్రతి ప్రాంతంలో మరింత మద్దతు పెంచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి నేత, కార్యకర్త పనిచేయాలని కోరారు. పార్టీ కార్యకర్తే నిజమైన అధినేత అని, కేడర్‌కు న్యాయం జరిగితేనే పార్టీ శాశ్వతంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేస్తూ పసుపు జెండా కోసం వారు చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు.
ప్రజల భూములకు సంబంధించిన పత్రాలపై అధికారుల ఫోటోలు ముద్రించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఏడాదిలోపు కొత్త సర్వేలు పూర్తి చేసి ఎలాంటి లోపాలు లేని పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అమరావతిని మూడు ముక్కలుగా చీల్చే ప్రయత్నాలు జరిగాయని ఇప్పుడు మళ్లీ రాజధానికి ప్రాణం పోసినట్టు చెప్పారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేస్తూనే అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తప్పుడు ప్రచారాన్ని తక్షణమే ఖండించాలని చంద్రబాబు సూచించారు. సోషల్ మీడియాతో పాటు ప్రత్యక్ష ప్రచారం ద్వారా వాస్తవాలు ప్రజలకు చేరవేయాలని అన్నారు. సూపర్–6 హామీల అమలు డీఎస్సీ మరియు పోలీస్ ఉద్యోగాల భర్తీ, రోడ్ల మరమ్మతులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
