రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తోతాపూరి మామిడి (Totapuri Mango) సాగుదారులకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం రూ. 260 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్‌లో సరైన ధర లేక తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతులకు ఇది మంచి ఊరటనిచ్చే అంశంగా మారింది. ఈ నిధులతో కిలో తోతాపూరి మామిడికి రూ.4 చొప్పున సబ్సిడీతో ప్రభుత్వం మామిడిని కొనుగోలు చేయనుంది. ఇది ప్రధానంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల రైతులకు ప్రత్యక్ష లాభం చేకూర్చనుంది.
ఉద్యానవన, పట్టుపరిశ్రమల డైరెక్టర్‌కు మొత్తం 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడిని సేకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల రైతులు తాము పండించిన పంటను తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి లేకుండా, ప్రభుత్వం ద్వారా గిట్టుబాటు ధర పొందగలుగుతారు. మామిడి మార్కెటింగ్‌లో సవాళ్లను ఎదుర్కొంటున్న రైతులకు ఇది భరోసా కలిగించే చర్య. గతంలోనూ మార్కెట్‌లో దిగవువ ధరలతో మామిడి రైతులు ఇబ్బంది పడిన సందర్భాల్లో, ప్రభుత్వం తక్షణ సహాయం అందించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది.
రైతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలలో ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ వంటి పథకాలు కీలకంగా మారాయి. ఈ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతుండటం వారికీ పెట్టుబడి భారాన్ని తక్కువ చేస్తోంది. ప్రత్యేకించి ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, మందుల కొనుగోళ్లకు అవసరమైన డబ్బును ప్రభుత్వం ఈ పథకాల ద్వారా అందిస్తోంది. అదే విధంగా పంట కోత తరువాత మార్కెట్‌లో గిట్టుబాటు ధర వచ్చేలా జోక్యం చేసుకుంటూ రైతులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఈ విధంగా చేపట్టిన చర్యలు వ్యవసాయాన్ని బలోపేతం చేయడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యూహంలో రైతుల పాత్రను మరింత శక్తివంతం చేయనున్నాయి.